Double Bedroom House | చిన్నగూడూరు, ఏప్రిల్ 24 : డబుల్బెడ్రూం ఇండ్లలొల్లి మరోసారి రచ్చకెక్కిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నగూడూరు మండల కేంద్రంలో 75 డబుల్బెడ్రూం ఇండ్లు రెండేండ్ల క్రితం నిర్మించారు. ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులను ఎంపికచేయలేదు. అనంతరం ప్రభుత్వం మారడంతో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని పేదలు గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు.
తహసీల్దార్ మహబూబ్అలీ పోలీసులతో వచ్చి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం ఇండ్లను కేటాయిస్తామని, తక్షణమే ఇండ్లు ఖాళీ చేయాలని కోరగా వారు వినలేదు. తమను ఖాళీ చేయిస్తే ఇక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆందోళనకు కారణమైన గంగాధరి అనిల్‌ను స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ కృష్ణకిశోర్ మాట్లాడుతూ.. ఆధారాలు చూపితే రెవెన్యూ అధికారులు వారికే ఇండ్లు కేటాయిస్తారని తెలిపారు. ఇండ్లలోకి అక్రమంగా చొరబడినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.