హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్‌ను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్రవారం దోస్త్ వెబ్సైట్లో కాలేజీల్లోని ఖాళీ సీట్ల వివరాలను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ప్రవేశ ప్రక్రియను ఈనెల 15,16 తేదీల్లో చేపడతామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మేనేజ్మెంట్, ప్రభుత్వ, రెసిడెన్షియల్ కలిపి మొత్తం 967 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 4,38,387 సీట్లు ఉండగా, ఇందులో 1,96,451 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 2,41,936 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఇందులో టాప్‌టెన్ కాలేజీల్లోనూ సీట్లు భర్తీకాలేదు. ఈ నేపథ్యంలో దోస్త్ స్పాట్ అడ్మిషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.