Dornakal | ఏడు మండలాలు.. రెండు మున్సిపాలిటీలతో విస్తరించిన డోర్నకల్ నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. 2009 నుంచి ఈ స్థానాన్ని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా టీడీపీ నుంచి సత్యవతిరాథోడ్ గెలుపొంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన రెడ్యానాయక్ టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతిరాథోడ్పై విజయం సాధించి, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 2018లో సైతం ఆయన గులాబీ జెండా ఎగురవేశారు. తాజా ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ తరఫున పోటీకి దిగారు.
డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. వాగులపై ఆనకట్టలు, చెక్ డ్యాంలు, ఉపకాల్వల నిర్మాణంతో సాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా దూరమయ్యాయి. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌కు వెళ్లేందుకు ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్డు నిర్మించారు. మరిపెడలో సుమారు రూ.20 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండగా, ఇటీవల సీఎం కేసీఆర్ మరో రూ.25 కోట్లు కేటాయించారు. రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా మారింది. డోర్నకల్‌లో సుమారు రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
మూడు వాగులు.. 24 చెక్ డ్యాంలు..
నర్సింహులపేట మండలం మీదుగా చిన్నగూడూరు, మరిపెడ నుంచి ఆకేరు వాగు, దంతాలపల్లి మండలంలో పాలేరు, డోర్నకల్ మండలంలో మున్నేరు వాగు ప్రవహిస్తున్నాయి. వీటిపై నిర్మించిన చెక్‌డ్యాంలతో సాగునీరు పుషలంగా అందుతున్నది. రూ.28 కోట్లతో ఆకేరు వాగుపై కొమ్ములవంచ, ఉగ్గంపల్లిలో రెండు ఆనకట్టలు, 10 చెక్‌డ్యాంలు నిర్మించారు. రూ.25 కోట్లతో పాలేరు వాగుపై పెద్దముప్పారం శివారులో ఆనకట్ట, 10 చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టారు. రూ.11 కోట్లతో మున్నేరు వాగుపై 4 చెక్ డ్యాంలను నిర్మించారు. మొత్తం 24 చెక్ డ్యాంలతో వాగులకు ఇరువైపులా సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
తళుకుమంటున్న తారు రోడ్లు
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాలకు రూ.2,500 కోట్లతో సుమారు 500 కిలోమీటర్ల మేర తారు రోడ్లు వేశారు. రూ.290 కోట్లతో 35 కిలోమీటర్ల మేర అంతర్గత, సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.
2,366 డబుల్ బెడ్ రూం ఇండ్లు
నియోజకవర్గానికి ఇప్పటివరకు 2,366 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటి నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాల్లో పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.
30 హెల్త్ సెంటర్ల నిర్మాణం
ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం, కేసీఆర్ కిట్లు, బాలింతలకు రూ.12 వేల చొప్పున అందిస్తుండడంతో ప్రసవాల సంఖ్య పెరిగింది. నియోజకవర్గంలో సుమారు రూ.6 కోట్లతో కొత్తగా 30 హెల్త్ సెంటర్లను (పల్లె దవాఖానలు) చేపట్టి, వైద్యులను నియమించారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
నియోజకవర్గంలో 755 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేసి, 456 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నది ప్రభుత్వం.గ్రామాలు, తండాల్లో ప్రతి రోజూ.. మండల, పట్టణ కేంద్రాల్లో రోజు విడిచి రోజు తాగునీరు అందుతున్నది.
…? కన్నెబోయిన రాజు