హైదరాబాద్ సిటీబ్యూరో/రామంతాపూర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు’ అంటూ ఆరంభించి ఇరుగుపొరుగు వారితో ముచ్చటిస్తున్నట్టుగా ఆసక్తిని రేకెత్తిస్తూ వార్తలను ప్రజల దరిచేర్చిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (74) స్వరం మూగబోయింది. 28 ఏండ్లకుపైగా వార్తా ప్రపంచాన్ని శాసించిన ఆ వ్యక్తి గుండెపోటుతో మలక్‌పేటలోని యశోద దవాఖానలో రెండురోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానులు, ప్రముఖులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. రామంతాపూర్‌లోని శ్రీరామన్నపురం టీవీ కాలనీలో సృగృహానికి మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు.
అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి అంతిమయాత్ర సాగింది. అంబర్‌పేట శ్మశానవాటికలో ప్రజల అశ్రునయనాల నడు మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన ఇకలేరన్న వార్తతో దూరదర్శన్ కార్యాలయం బోసిపోయింది. సాహిత్యంపై మక్కువతో శాంతిస్వరూప్ కొన్ని నవలలు కూడా రాశారు. శాంతిస్వరూప్ సీనియర్ యాంకర్ రోజారాణిని వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1983 లో నవంబర్ 14న రామంతాపూర్ దూరదర్శన్ చానల్లో శాంతిస్వరూప్ తొలిసారిగా వార్తలు చదివారు. 2011లో ఆయన ఉద్యోగ విరమణ పొందారు. ఆయన సేవలకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది.