హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ సర్కార్ తీసుకొచ్చారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భూభారతి తెచ్చి భూముల పట్టాల్లో పారదర్శకత తీసుకొస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. భూభారతి పోర్టల్‌ను అక్రమాలకు అడ్డాగా మార్చిందని ఆరోపించారు. యాదాద్రి, జనగామ, రంగారెడ్డి జిల్లాలో ఈ పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని భూ మాఫియా అక్రమాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. 52 లక్షల స్లాట్స్ బుక్ చేస్తే 4,300 స్లాట్ల డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.