హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29(నమస్తే తెలంగాణ) : యథేచ్ఛగా చేరుతున్న మురుగు నీటిని నియంత్రించినప్పుడే మూసీ జీవనదికి పునరుజ్జీవం సాధ్యమని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి తేల్చిచెప్పారు. దశాబ్దాల కాలంగా చేరుతున్న మూసీ మురుగులో, అడుగున చేరిన బురదలో ఎన్నో ప్రమాదకర రసాయనాల అవశేషాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం పైనుంచి గోదావరి నీటిని పారించినంత మాత్రాన అడుగున చేరిన రసాయనాల తీవ్రత తగ్గే అవకాశం లేదని, దీనితోనే మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో కాలుష్య తీవ్రత తగ్గుతుందని అనుకోవడం నీటిలో డబ్బు మూటలు కుమ్మరించినట్టే అవుతుందని హెచ్చరించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులతో నది జీవావరణం మెరుగుపడదని, కాలుష్య కారకాలనూ నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. మురుగునీటి వ్యర్థాల శుద్ధి లేకపోవడం, అడ్డగోలుగా జరిగిన ఆక్రమణలు, మౌలిక వసతుల పేరిట మూసీలో జరిగిన నిర్మాణాలతో నది జీవం కోల్పోయే పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే శాస్త్రీయ విధానాలతో మూసీకి పునరుజ్జీవం పోయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన మరో లేఖలో దొంతి నర్సింహారెడ్డి పైఅంశాలతోపాటు ఇచ్చిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే కింది విధంగా ఉన్నాయి.
అనంతగిరి కొండల నుంచి ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తున్న మూసీ నదీ అత్యధిక భాగం హైదరాబాద్ నగరం మీదుగానే ప్రవహిస్తున్నది. నగరం దాటేంత వరకు 55 కిలోమీటర్ల పరిధిలో నది పరీవాహక ప్రాంతమే కాలుష్య కాసారంగా మారింది. జంట జలాశయాలకు దిగువన జరుగుతున్న కాలుష్య కార్యకలాపాల కంటే.. నది జన్మస్థానం నుంచి జంట జలాశయాల వరకు జరుగుతున్న ఆక్రమణలు నదీతీర ప్రాంతం కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అదనంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న వందలాది చెరువులు, కుంటలు 48 శాతానికి పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఒకప్పుడు ఇందులో దాదాపు 2,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండేవి. కానీ వాటి స్థానంలో భవన నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటన్నింటితో నగరంలో మూసీ జీవం కోల్పోయే ప్రమాదంలో పడింది.
మూసీ అభివృద్ధి పేరిట దశాబ్దాలుగా ఇక్కడి జీవావరణ విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. అశాస్త్రీయ విధానాలతో జరుగుతున్న పునరుజ్జీవ కార్యకలాపాలు మూసీ జలాలతోపాటు, పరీవాహక ప్రాంతాల్లోనూ కలుషితాలకు కారణం అవుతున్నాయి. అరుదైన వృక్ష సంపద, మత్స్య సంపద కూడా కనుమరుగైంది. మూసీ క్యాచ్మెంట్ ప్రాంతంలోని వాటర్‌బాడీస్ సమీపంలో చేపట్టిన నిర్మాణ కార్యకలాపాలు నిర్వీర్యం చేశాయి. అవుటర్ రింగురోడ్డు కారణంగా నదీ పరీవాహకంలో 171 చెరువుల విధ్వంసం జరిగింది. దీంతోనే మూసీ నది జలావరణం దెబ్బతిన్నది. భవన నిర్మాణాలతో నదీ పరీవాహక ప్రాంతంలో ఇన్లెట్, అవుట్లెట్లు లేకుండా పోయాయి.
మూసీ నది కాలుష్యానికి అడ్డగోలుగా నగరం మీదుగా ప్రవహించే 90 శాతం మురుగు నీరే కారణం. నగరవ్యాప్తంగా నిత్యం ఉత్పత్తి అయ్యే 1,800 ఎంఎల్డీల మురుగు నీటిలో సగం కూడా శుద్ధికావడం లేదు. దీనికి సీఎస్ఐఆర్-నీరి లాంటి పరిశోధనా సంస్థలే కీలకమైన ప్రాంతాల్లో 19 ఎస్టీపీలను నిర్మించాలని సూచించింది. ఇప్పుడున్న వాటికి అదనంగా నిర్మించే ఈ ఎస్టీపీలతో నూరుశాతం మురుగు నీటి శుద్ధీకరణ సాగుతున్నది. నేరుగా మూసీలో కలుస్తున్న వ్యర్థాలకు అదనంగా, పారిశ్రామిక వ్యర్థాలు నదికి శాపంగా మారాయి. శుద్ధి చేయకుండానే నేరుగా కలుస్తున్న వ్యర్థాలతో నది జీవవైవిధ్యమే లేకుండా పోయింది.
ఎక్కడో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చే గోదావరి నీళ్లను జంట జలాశయాల్లో నింపి అక్కడి నుంచి దిగువకు విడుదల చేసినంత మాత్రాన మూసీ అభివృద్ధి కాదు. ఈ నది ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారమూ చూపదు. ఒకవేళ మూసీ నదిని అభివృద్ధి చేయాలంటే మురుగునీటిలో, నది అడుగున చేరిన రసాయనిక వ్యర్థాలను తొలగించినప్పుడే, స్వచ్ఛమైన జలాలతో నదిని నింపినప్పుడే మూసీ మెరుగుపడుతుంది. అంతేగానీ, నీటిని విడుదల చేసి, పరీవాహక ప్రాంతంలో భారీ భవంతులు నిర్మిస్తే మరింత వేగంగా మూసీ కనుమరుగు అవుతుంది.
అనంతగిరి నుంచి నల్లగొండ జిల్లా వరకు ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక రివర్ బేసిన్ అథారిటీని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యకలాపాలు శాశ్వత పరిష్కారం చూపవు. సుస్థిర, శాస్త్రీయ విధానాలతోనే మూసీ పునరుజ్జీవం సాధ్యపడుతుంది. విస్తృతంగా చేపట్టే నిర్మాణ కార్యకలాపాలతో జలావరణం కనిపించకుండాపోతుంది. పరిశోధనా సంస్థలు, ప్రజా అవగాహన విధానాలతో పరిరక్షణకు సర్కార్ పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులను భాగస్వాములను చేస్తూ మూసీ పునరుజ్జీవ ప్రణాళికలను పట్టాలెక్కించినప్పుడే సత్వర ఫలితాలు, కాలుష్య ప్రతికూలతలు లేకుండా నదీ పరీవాహక ప్రాంతం మెరుగుపడుతుంది.