తిరుమల : గోవిందుడు కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
కాగా శుక్రవారం స్వామివారిని 74,636 మంది భక్తులు దర్శించుకోగా 43,084 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ట్రక్కు విరాళం
ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళం ( Truck Donation ) గా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్చార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.