కృష్ణకాలనీ, జూన్ 18 : తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రభుత్వం పట్టాలిచ్చేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని లబ్ధిదారులు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్గడ్డలో నిర్మించి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు పట్టాల కోసం కొద్దిరోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరో రోజైన మంగళవారం అక్కడే వంటలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రమేశ్, కుమార్, తుకారాం తదితరులు మాట్లాడుతూ.. వారం రోజులుగా తాము చేస్తున్న ఆందోళనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్టోబర్లో కలెక్టర్ పర్యవేక్షణలోనే ప్రభుత్వ అధికారులు మూడుసార్లు సర్వేచేసి, ఇండ్లులేని తమను గుర్తించి ఇండ్లు కేటాయించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తమ గోడును పట్టించుకొని పట్టాలివ్వాలని కోరారు. లేదంటే కుటుంబ సభ్యులతో వచ్చి తమకు కేటాయించిన ఇండ్లల్లోకి ప్రవేశిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు.