Harish Rao | ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ప్రజలు తమను ప్రశ్నించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. సంక్షేమంలో విఫలమైన రేవంత్ రెడ్డి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. యాదాద్రిలో దాడులు చేస్తున్నవారిని పోలీసులే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. సిద్దిపేట బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు.
కౌశిక్ రెడ్డి, అల్లు అర్జున్ ఇళ్ల మీద దాడులు, బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాలపైనా కాంగ్రెస్ గుండాలు దాడులు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి మౌనం ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని ప్రమాణం చేసి, అందుకు విరుద్ధంగా రేవంత్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రం కంటే రాజకీయ ప్రయోజనాలే రేవంత్ రెడ్డికి ముఖ్యమయ్యాయని హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని అన్నారు. మా ఓపికను బలహీనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి.. విపక్ష నేతల అరెస్టు చుట్టే పోలీసుల్ని తిప్పడంతో రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిందని తెలిపారు. 23 శాతం క్రైం రేట్ పెరిగిందని.. మతకలహాలు కూడా పెరిగాయని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం దాడుల సంస్కృతి మార్చకుంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి పాలన పెట్టి అయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.