హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇద్దరు ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోరాదని హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వచ్చే జనవరి 19వ తేదీ వరకు పొడిగించింది.
ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌తోపాటు రిటైర్డు ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్‌జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసభర్వాల్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నాలుగు పిటిషన్లకుగాను కేసీఆర్ పిటిషన్‌కు మాత్రమే కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. మిగిలిన మూడు పిటిషన్లలో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. దీనిపై హైకోర్టు, గత అక్టోబరు 7న నోటీసులు జారీ చేశామని, కౌంటర్ల దాఖలుకు చాలా సమయం ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ గడువు కోరడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా అన్ని పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మూడు వారాల్లో పిటిషనర్లు తమ అభ్యంతరాలతో రిప్లయ్ కౌంటర్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.