మహబూబ్నగర్, జూలై 23 : తమ మీద కోపంతో అభివృద్ధి పనులు ఆపొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, ప్రారంభం కానీ పనులపై సమీక్షించి అభివృద్ధిని వేగవంతం చేయాలని, చేసిన పనులకు, గతంలో శంకుస్థాపనలు చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ప్రజల ముందు అబాసుపాలు కావొద్దని హితవు పలికారు. బుధవారం న్యూ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కానీ జిల్లాకు ఆయన చేసిందేమి లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తైంది. మరో 10 శాతం పనులు పూర్తి చేస్తే జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
తెలంగాణ కోసం పోరాటం చేసినం. జైళ్లకు పోయినం. పదేండ్లు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసినం. కానీ ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేయకుండా మాట్లాడితే ఎవరు పడరన్నారు. జిల్లా మంత్రులు, ఏమ్మెల్యేలు అందరూ ఐక్యంగా పనిచేసి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేయలేదు.. కొత్త పనులు చేపట్టలేదన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొంతన లేని సమాధానం చెబుతుందన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. మరికొందరు ఆర్డినెన్సు ద్వారా రిజర్వేషన్ అమలు చేస్తామని అంటున్నారన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు తరహా చట్ట సవరణ చేయాలన్నారు. అందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నం చేయాలని చెప్పారు.
మన్యంకొండ రోప్ వే, ఏసి కల్యాణ మండపం, విశ్రాంతి గదుల నిర్మాణానికి టెండర్ పూర్తి చేసినం. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. స్టేడియంలో సింథటిక్ ట్రాక్, టూరిజం హోటల్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. టీడీ గుట్ట నుంచి అప్పనపల్లి వరకు మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో మహబూబ్ నగర్ టౌన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చాం. పనులు ప్రారంభించాల్సి ఉందని, ఆ పనులను వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే నిధులు వస్తాయని ప్రజలు అనుకున్నారు. కొల్లాపూర్ వచ్చి ఏం ప్రకటన చేయకుండానే వెళ్లినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణాధ్యక్షుడు శివరాజ్, మాజీ ఎంపీపీ సుధా శ్రీ, పార్టీ మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.