అవసరార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిందే గిఫ్ట్ ఏ స్మైల్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. అంతకంటే మరో తృప్తి ఏమీ ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. శుభసందర్భాలున్నప్పుడు లక్షల రూపాయలు ఖర్చుచేస్తుంటారు. అలాంటి వృథాఖర్చులు పెట్టకుండా మనకు ఆత్మసంతృప్తినిచ్చే, సమాజానికి కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పుట్టినరోజు, ఇతర శుభకార్యాల సందర్భంగా వృథాఖర్చులు పెట్టకుండా పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. అవసరార్థులను ఆదుకోవటంలో ఆత్మసంతృప్తితోపాటు సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. తన జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు 130 త్రిచక్రవాహనాలను విరాళంగా అందించానని, మరో అరవై, డబ్భు వరకు ఇస్తానని ప్రకటించారు. తన పిలుపునకు స్పందించి టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే 1,000 త్రిచక్రవాహనాలు విరాళంగా ప్రకటించారని తెలిపారు. ఇంట్లో శుభకార్యాలు, జన్మదినోత్సవాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితరవాటి కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టడంమాని ఇతరులకు ఉపయోపడే పనులు చేస్తే ఎక్కువ సంతోషం కలుగుతుందని అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు 100 త్రిచక్రవాహనాలు విరాళంగా ఇస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వాహనాలను ఆదివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో దివ్యాంగులకు అందజేశారు. వారితో సెల్ఫీలు దిగి, యోగక్షేమాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఒక్క పిలుపుతో వెయ్యి వాహనాలు
అవసరార్థుల ఆదుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిందే గిఫ్ట్ ఏ స్మైల్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. అంతకంటే మరో తృప్తి ఏమీ ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ప్రత్యేకించి శుభసందర్భాలున్నప్పుడు హోర్డింగులు, బ్యానర్ల కోసమే లక్షల రూపాయలు ఖర్చుచేస్తుంటారు. అలాంటి వృథాఖర్చులు పెట్టకుండా మనకు ఆత్మసంతృప్తినిచ్చే, సమాజానికి కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గతేడాది కరోనా సందర్భంగా ఒక ఆలోచనతో జూలై 24న నా నియోజకవర్గం సిరిసిల్లలో 6 అంబులెన్స్‌లు విరాళం ఇస్తున్నానని ప్రకటించాను. ఆ వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు అనేకమంది స్పందించి 100 అంబులెన్స్‌లు విరాళంగా ఇచ్చారు. ఒక్క పిలుపుతో వంద అంబులెన్స్‌లు విరాళం ఇవ్వటం చాలా సంతోషంగా అనిపించింది. ఎంతోమందికి కష్టకాలంలో అవి ఉపయోగపడ్డాయి. అలాగే ఈ ఏడాది దివ్యాంగ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి 100 త్రిచక్రవాహనాలు విరాళం ఇస్తానని ప్రకటించాను. వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ముందుకొచ్చి 1,000 వాహనాల వరకు డోనేట్ చేస్తామని ప్రకటించటం చాలా సంతోషం.
జీవనోపాధి మార్గాలు..
ఒక దివ్యాంగుడికి వాహనం ఇస్తే వెసులుబాటు ఉంటది అనుకొన్నా. కానీ వారి నుంచి కొన్ని వినతులు వచ్చాయి. ఈ వాహనాలు చాలా మందికి జీవనోపాధికి తోడ్పడుతాయని తెలసింది. కొంతమంది షాప్ పెట్టుకొని కూరగాయలు తెచ్చుకుంటాను అన్నారు. మరికొందరు జనరల్ స్టోర్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. చాలా సంతోషం వేసింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం మీ ముఖాలపై చిరునవ్వు వస్తే అంతకంటే ఆనందం మరొకటి లేదు.అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యమ్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ తదిరతులు పాల్గొన్నారు.
ఆత్మీయ పలకరింపు
మంత్రి కేటీఆర్ జలవిహార్‌లో దివ్యాంగులతో మూడు గంటలపాటు గడిపారు. వాహనాలు అందుకొన్న ప్రతీ ఒక్కరిని పేరు పేరునా పలకరించారు. మిగితా కార్యక్రమాల వలే కేటీఆర్‌ను కలిసేందుకు నేతల పోటీపడకుండా ఉండిపోవటంతో మంత్రి దివ్యాంగుల సాధకబాధకాలను సావధానంగా అడిగి తెలుసుకొన్నారు. ఏం చదువుకున్నారు? ఇప్పుడేం చేస్తున్నారు? ఈ వాహనం మీకెలా ఉపయోగపడుతుంది? కుటుంబ పరిస్థితి ఏమిటీ? ఏవైనా సమస్యలున్నాయా? అంటూ ఆరా తీశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఈ నెల 4న తెలంగాణ భవన్లో భరోసానింపి వారికి బాసటగా నిలిచారు. మరణించిన 80 కార్యకర్తల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా ఆదివారం జలవిహార్‌లో దివ్యాంగులతో గడిపి వారిలోనూ ఆత్మైస్థెర్యాన్ని నింపారు. తమ వద్దకే మంత్రి కేటీఆర్ వచ్చి ఫొటోలు దిగే అవకాశం కల్పించటమే కాకుండా ఆయనే తమ మొబైల్ ఫోన్లు తీసుకొని సెల్ఫీ తీశారని దివ్యాంగులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. కేటీఆర్‌ను కలిసిన క్షణాలు తమ జీవితంలో అత్యంత మధురమైనవని పేర్కొన్నారు.
దేవుడు ప్రత్యక్షమైనట్టే ఉన్నది
రామన్నను (మంత్రి కేటీఆర్) చూస్తే దేవుడు ప్రత్యక్షమైనట్టే అనిపించింది. భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదుగానీ మా దివ్యాంగులకైతే రామన్న దేవుడిలెక్క వచ్చిండు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. కుటుంబం గడవటం కోసం ఇంటి నిర్మాణ పనులు చేసేవాన్ని. 2007లో ప్రమాదం జరిగి స్పైనల్కార్డ్కు దెబ్బ తాకింది. నా బాధచెప్పంగనే రామన్న భుజం తట్టిండు. నేనున్నా అని చెప్పిండు. నోటిమాటరాలేదు. చేతులెత్తి మొక్కిన.
బీ విజయ్, కూకట్పల్లి
తొలివిడతగా…
ఆదివారం తొలివిడతలో త్రిచక్రవాహనాలు అందుకొన్నవారిలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన 130 మంది, కూకట్పల్లి నియోజకవర్గంవారు 100 మంది, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 70 మందితోపాటు మరో 100 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారితో కలిపి 400 మంది ఉన్నారు. అనేక మంది నేతలు వాహనాలు విరాళం ఇస్తామని ప్రకటించినందున వారి నియోజకవర్గాల్లో మలివిడత వాహనాల పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.
త్రిచక్రవాహనాలు విరాళంగా ప్రకటించిన మరికొంతమంది నేతలు
పేరు హోదా వాహనాలు
ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి 105
రంజిత్‌రెడ్డి ఎంపీ 101
నవీన్‌కుమార్ ఎమ్మెల్సీ 100
కృష్ణారావు ఎమ్మెల్యే 100
శంభీపూర్‌రాజు ఎమ్మెల్సీ 60
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్సీ 60
పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రి 50
మల్లారెడ్డి మంత్రి 50
బాల్క సుమన్ ప్రభుత్వ విప్ 50
కేపీ వివేకానంద ఎమ్మెల్యే 50
మర్రి రాజశేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ నేత 24
గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్ 20
గాదరి కిశోర్ ఎమ్మెల్యే 20
టీఆర్ఎస్ నేతలు రాజీవ్‌సాగర్, క్రిశాంక్, సతీశ్‌రెడ్డి, పీ జగన్ ఒక్కొక్కటి చొప్పున ప్రకటించారు.
కేటీఆర్‌తో వక్ఫ్‌బోర్డు చైర్మన్ భేటీ
మంత్రి కేటీఆర్‌తో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ ఆదివారం భేటీ అయ్యారు. వక్ఫ్‌బోర్డు చేపట్టిన కార్యక్రమాలు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకొంటున్న చర్యలను కేటీఆర్‌కు వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మైనారిటీల సంక్షేమానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములను స్వాధీనం చేసుకొంటున్నామని, అక్రమ రిజస్ట్రేషన్లను రద్దు చేస్తున్నామని సలీమ్ వివరించారు.