హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి, ఎన్నికల హామీలను విస్మరించవద్దని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సర్కారు అభయహస్తం పథకాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని, అప్పులను తీర్చేందుకే అప్పులు తెస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పులను చూపి పథకాలను ఎత్తగొట్టవద్దని హెచ్చరించారు. బడాకాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నట్టుగానే చిన్నకాంట్రాక్టర్ల బిల్లులను కూడా చెల్లించాలని, బిల్లులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగవర్గాల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.