హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు గ్రూప్-1 పీడకలగా మారింది. వామ్మో.. గ్రూప్ వన్నా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. తమ శాఖలోని పోస్టులను గ్రూప్-1లో కలపొద్దంటున్నారు. గ్రూప్-1లో కలిపితే ఆ పోస్టులు భర్తీకావడం కష్టమన్న భావనలో ఉన్నారు. ఇలాంటి అభిప్రాయంతో ఉన్నవారిలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందువరుసలో ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డిప్యూటీ ఈవో) పోస్టులను గ్రూప్-1 నోటిఫికేషన్లో కలిపి భర్తీచేయాలని విద్యాశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించా రు. 24 పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చింది.
గ్రూప్-1 అంటేనే వివాదాల మయంగా మారింది. 2011 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లోని పోస్టులను సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2017లో భర్తీచేయాల్సి వచ్చింది. 2022లో జారీచేసిన గ్రూప్-1 కూడా అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆఖరుకు ఈ నోటిఫికేషనే రద్దయ్యింది. 2024 నోటిఫికేషన్‌కు ఇదే పరిస్థితి. 563 పోస్టుల భర్తీకి ఇప్పటికీ అనేక చిక్కుముడులు వెంటాడుతున్నా యి. హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్లింది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో ఈ పోస్టుల ను గ్రూప్-1లో కలపొద్దన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. వీటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీచేయడమే బెటర్ అన్న భావనకు వచ్చారు. టీజీపీఎస్సీకి భర్తీ చేసే పోస్టుల వివరాలను సైతం పంపించారు. మరికొన్ని శాఖల అధికారులు సైతం ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్వంటి పోస్టులను గ్రూప్-1లో కాకుండా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలన్న వాదనలున్నాయి.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీ సహా కొత్త నోటిఫికేషన్ల విడుదలపై టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ఈ వారంలోనే కమిషన్ ప్రత్యేకంగా భేటీ కానున్నది. ఈ భేటీలో పలుశాఖల పోస్టుల భర్తీ వివరాలు(ఇండెంట్లు), వాటి భర్తీపై చర్చించనున్నట్టు తెలిసింది. దీంతోపాటు గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా, తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.