వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 17: వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు ఇవ్వొద్దని, అందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు హెచ్చరించారు. బుధవారం 9వ రోజు ఉదయం నుంచే వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ‘సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్’, ‘సేవ్ ఫార్మర్స్’, ‘స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని పాలెం, వరంగల్, సిరిసిల్ల, అశ్వరావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం నుంచి తరగతులను బహిష్కరిస్తున్నట్టు చెబుతూ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు నిర్మాణంతో వర్సిటీ పరిధిలోని పర్యావరణం దెబ్బతింటుందని, వ్యవసాయ పరిశోధనలకు అపారనష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మించి యూనివర్సిటీని చీల్చడం సరికాదని జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణవేత్త రవిబాబు విఠల్ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షణికావేశంతో, స్వార్థంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులతోపాటు వ్యవసాయ సంఘాలు, రైతులతోపాటు ప్రజలు కూడా ఉద్యమం చేపట్టి యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. వేలాదిమంది వ్యవసాయ విద్యార్థులకు, ప్రధానంగా రాష్ట్ర రైతాంగానికి యూనివర్సిటీ అండగా ఉందని పేర్కొన్నారు. తొమ్మిదోరోజు నిరసనలో వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్‌కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, శంకర్‌నాయక్, రాకేశ్ పాల్గొన్నారు.