హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై డబుల్ డ్రామాలు వద్దని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా కృషి చేస్తే అమలు సాధ్యమేనని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతోనే 50% పరిమితి ఎప్పుడో దాటిందని చెప్పారు. హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ నెల 8న వెలువడనున్న కోర్టు తీర్పు ఆధారంగా, ఆ కేసులో సీపీఐ కూడా ఇప్లీండ్ అయ్యే విషయంలో, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైనా ఆదివారం జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ప్రధాని మోదీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్ పాల్గొన్నారు.