హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): ‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల దండకం అందుకున్నడు.. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నడు.. పార్టీ శ్రేణులు ఆయన ట్రాప్‌లో పడవద్దు..ప్రజా సమస్యలపై సమరాన్ని ఆపొద్దు’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార క్షేత్రంలో ప్రభుత్వతప్పిదాలను ఎండగడుతూ హామీల అమ లు మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చా రు. ఈమేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
పద్నాలుగేండ్ల సుదీర్ఘపోరాటంతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కేటీఆర్ కొనియాడారు. ఒక తండ్రిలా రాష్ట్ర ప్రజలను అక్కున చేర్చుకొని, సమైక్య పాలనలో పడావుపడ్డ తెలంగాణను ప్రగతిబాటలో నడిపించిన మహోన్నత శిల్పి అని ప్రశంసించారు. ఆయన ఏనాడూ బిరుదులు, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని పేర్కొన్నారు. కానీ అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్రపై దాడి అని అభివర్ణించారు. కేసీఆర్ కిర్తీ నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దని కేటీఆర్ సూచించారు. ప్రజల కన్నీటిని తుడిచేలా, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా పోరాటం సాగాలని పిలుపునిచ్చారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లు, రైతుభరోసా అందక ప్రైవేట్ వడ్డీవ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల పక్షాన గొంతెత్తాలని హితబోధ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనను ఎలుగెత్తిచాటాలని సూచించారు. గురుకులాల్లో విషాహారం తిని రాలిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని గల్లాపట్టి నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, డీఏలు అందక, పీఆర్సీ రాక నలిగిపోతున్న ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.
‘మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణాల వార్డుల్లోని మౌలికవసతులు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ అందాల్సిన సంక్షేమ పథకాల మీద చర్చ జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి బూతు పురాణంతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నడు. తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు నుంచి రాష్ర్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉన్నది’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
‘మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూండాల దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడవద్దు’.. పార్టీ పరంగా అండగా ఉంటాం’ అని శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడులను ఖండించారు. జూబ్లీహిల్స్‌లో కార్పొరేటర్ దేదీప్యపై ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ అనుచరులు చేసిన దాడిని ఖండించారు.
సింగరేణిలో బొగ్గు, సోలార్ పవర్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికీ వెళ్లి వివరించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ నీటి వాటాను పొరుగు రాష్ర్టానికి ధారాదత్తం చేస్తున్న రేవంత్‌రెడ్డి కోవర్టు ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పదేండ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేండ్లలో తెలంగాణ అనుభవిస్తున్న దుస్థితికి గలకారణాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని విజ్ఞప్తిచేశారు. ప్రజల తీర్పే కేసీఆర్‌కు ఇచ్చే అసలు సిసలైన గౌరవమని ఉద్ఘాటించారు.