హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ) : హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరెస్టు నుంచి ఊరట లభించింది. ఈ నెల 28 వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌశిక్‌రెడ్డిపై కేసులు ఎందుకు నమోదవుతున్నాయని సందేహం వ్యక్తం చేసింది. తన వద్దకు వచ్చిన కేసుల్లో ఇది నాలుగోది అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ దర్యాప్తునకు సహకరించాలని కౌశిక్‌రెడ్డికి సూచించింది. తన భర్తను రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపిస్తూ క్వారీ యజమాని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సుబేదారి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు.
ఈ నెల 27న ఎలతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కౌశిక్‌రెడ్డి హాజరుకానున్నారని, ఈలోగా పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు ప్రతివాదన చేస్తూ.. క్వారీ యజమానిని పిటిషనర్ బెదిరించి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, పిటిషనర్ గతంలో డబ్బు వసూలు చేశారని చెప్తున్న పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. అప్పుడే కేసు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. పిటిషనర్ బెదిరించిన తర్వాత మూడు రోజులకు రాత్రి 9 గంటల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. పాడి కౌశిక్‌రెడ్డిపై ఎందుకు కేసులు నమోదవుతున్నాయని సందేహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌పై కేసులు నమోదు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులకు, ఫిర్యాదుదారు(డీఫ్యాక్టో కంప్లెయినెంట్)కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిపే వరకు కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.