సంగారెడ్డి, మార్చి 2(నమస్తే తెలంగాణ) : సర్కారు బడి బాగు కోసం ఉమ్మడి మెదక్ ప్రజాప్రతినిధులు తమవంతు విరాళాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి అండగా నిలిచారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు తమవంతు విరాళాలు ఇచ్చి ఉదారత చాటుకొన్నారు. బుధవారం సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సమక్షంలో విరాళాలు ప్రకటించారు. మన ఊరు-మనబడికి పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు, దాతల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు మంత్రి తెలిపారు. పాఠశాల నిర్మాణానికి స్థలం, రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు విరాళం ఇస్తే వారి పేర్లను పాఠశాల తరగతి గదులు, బ్లాక్‌లు, పాఠశాలకు పెడతామని చెప్పారు.
దేశమే ఆశ్చర్యపోయేలా..
దళితబంధు, మన ఊరు-మన బడి గొప్ప పథకాలని, దేశమే ఆశ్చర్యపోయేలా వీటిని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సంగారెడ్డి జడ్పీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘మన ఊరు- మనబడి’కి తెలంగాణ ప్రభుత్వం రూ.7,289 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు స్పష్టంచేశారు. ఈ నెల 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి విడతలో భాగంగా ప్రతి జిల్లాలో 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. నిధులు ఖర్చు చేసే అధికారం జిల్లామంత్రులు, కలెక్టర్లకు ఇచ్చామని తెలిపారు.
వైద్యారోగ్యశాఖలో రిజర్వేషన్లు
వైద్య ఆరోగ్యశాఖలో పనుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దళితబంధు లబ్ధిదారులు మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు పెట్టుకొనేందుకు ముందుకొస్తే వారికి లైసెన్స్ ఫీజు మినహాయించనున్నట్టు స్పష్టంచేశారు. ఇదివరకే వైన్‌షాప్‌లు, ఫర్టిలైజర్ షాపుల కేటాయింపుల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా దళితబందు లబ్ధిదారులకు వీలైన చోట రిజర్వేషన్లు వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ తర్వాత దళితబంధు కింద పెద్ద సంఖ్యలో యూనిట్లను మంజూరు చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రఘునందర్రావు, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాశ్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
