ములుగురూరల్, సెప్టెంబర్ 8 : ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. మహేశ్ ఆత్మహత్య ముమ్మాటికి సర్కార్ హత్యేనని, దీనికి మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని మహేశ్ కుటుంబానికి అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.