హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : సినీ పరిశ్రమలోకి ఓ షాడో మంత్రి ప్రవేశించారా? అసలు మంత్రిని పక్కకు నెట్టి ఆయనే అన్నీ చక్కదిద్దుతున్నారా? షాడో మంత్రి కన్ను గీటితేనే టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయా? షోడో నీడలోనే సినీ ఇండస్ట్రీ నిర్ణయాలు జరుగుతున్నాయా? ఆయన గ్రీన్‌కార్డు చూపితేనే సినిమా వాళ్లకు ముఖ్యనేత దర్శనమా? టికెట్ల ధరలను పెంచొద్దన్న సర్కారు సంకల్పాన్ని షాడోనే షేడ్ చేశారా? ఆయన కనుసన్నల్లోనే బ్లాక్ టికెట్ల దందాకు తెరలేసిందా? అసలు మంత్రి కంటే షాడో మంత్రికే ముఖ్యనేత ఎక్కువ పవర్స్ ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నింటికీ సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తున్నది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి నిర్ణయంలోనూ కచ్చితంగా ఆయన ఆనుమతి ఉండాల్సిందేనట. ఇండస్ట్రీలో పేరుమోసిన సినీ పెద్దలకు కూడా ఆయన అనుమతిస్తేనే ముఖ్యనేత దర్శనం దొరుకుతుందని అటు సినీవర్గాలు, ఇటు సీఎంవో వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ శాఖకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా ఆయనే తీసుకొని, సీఎం అనుమతితో అమలు చేయాల్సి ఉంటుంది. కానీ సినీ పరిశ్రమ అభివృద్ధి, నియంత్రణలో ఆయన ప్రమేయం లేకుండానే పనులు జరిగిపోతున్నాయని, పైగా మంత్రి తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కటి కూడా అమలు కావడంలేదని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నది. మంత్రిని పక్కకు నెట్టి ముఖ్యనేత ఆశీస్సులతో తెరమీదకు వచ్చిన షాడో మినిస్టరే అన్ని పనులు చక్కదిద్దుతున్నారని సినీవర్గాలు చెప్తున్నాయి. పుష్ప-2 చిత్రం తొక్కిసలాట సమయంలో నటుడు అల్లు అర్జున్‌తో వివాదం ఏర్పడినప్పటి నుంచి షాడో మినిస్టర్ మొత్తం సినీ ఇండస్ట్రీని తన చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. సినిమా రంగంలో ప్రముఖులు అని గుర్తింపు పొందిన వారినందరినీ షాడో మంత్రి వెంటబెట్టుకొని ముఖ్యనేతను నేరుగా కల్పిస్తున్నట్టు తెలిసింది. ఇంతకాలం సైలెంట్‌గానే అన్నీ గమనించిన ఆ శాఖ మంత్రి ఇటీవల మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
పుష్ప-2 చిత్రం ప్రదర్శిస్తున్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి, ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోల టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించేది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ కొద్దిరోజులకే నాలుక మడతేసి ప్రభుత్వం పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధర పెంచుకొనేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల వెనుక షాడో మినిస్టర్, ప్రముఖ నిర్మాత ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయా సినిమా హీరోలను, ప్రముఖ నిర్మాతను ఆ షాడో మంత్రి ముఖ్యనేతతో కలిపినట్టు, గంపగుత్తగా ఒక రేటు మాట్లాడిన తరువాతే సినిమా టికెట్ ధరల పెంచుకొనేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడినట్టు ప్రచారం ఉన్నది. తాజాగా ఆంధ్ర డిప్యూటీ సీఎం నటించిన ఓజీ సినిమాకు టికెట్ ధర భారీ మొత్తంలో పెంచుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వెనుక షాడో మినిస్టర్, ప్రముఖ నిర్మాత మంత్రాంగమే ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను బలపరిచినట్టుగానే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. తనకు తెలియకుండానే ఓజీ సినిమా టికెట్ల ధరలు పెంచినట్టు ఆయన వెల్లడించారు. తన శాఖకు సంబంధించి హోం శాఖ స్పెషల్ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. షాడో మంత్రి ముఖ్యనేతను ఒప్పించి, మెప్పించి టికెట్ల ధరలు పెంచించినట్టు సినీవర్గాలు చెప్తున్నాయి. ఓజీ సినిమాకు ప్రీమియర్ మల్టీప్లెక్స్‌లో ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తే లాభాలు రావని పసిగట్టిన వారిద్దరు.. సింగిల్ స్రీన్‌పై బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారన్న ప్రచారం జరుగుతుంది. కేవలం నాలుగు థియేటర్లకు అనుమతులు ఇచ్చి ఆన్లైన్లో ఒకో టికెట్‌ను రూ.3000 నుంచి రూ.4000 చొప్పున బ్లాక్‌లో అమ్ముతున్నారని ప్రచారం జరిగింది.
గత నెలలో వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు షూటింగ్‌లను బహిషరించి ఆందోళనకు దిగారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని కార్మికుల డిమాండ్లపై సినీ నిర్మాతలతో చర్చలు జరపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆదేశించినట్టు సమాచారం. నిర్మాతలకు ఆచరణ సాధ్యంకాని కొన్ని ప్రాతిపాదనల లిస్టును మంత్రి చేతిలో పెట్టి చర్చలు సఫలం చేయమని పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ కోమటిరెడ్డి ప్రతిపాదనలను నిర్మాతలు అంగీకరించలేదట, పైగా అవి ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదనలు అని నిర్మాతలు ముఖం మీదనే చెప్పేశారట. ఆ వెంటనే షాడో మినిస్టర్ రంగప్రవేశం చేసి ప్రముఖ తెలంగాణ నిర్మాత ఆధ్వర్యంలో ఇతర నిర్మాతలను సీఎం వద్దకు పిలిచి సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. ఈ సమావేశానికి ఆ శాఖ మంత్రికి కనీస ఆహ్వానం కూడా లేదని తెలిసింది. అటు ప్రభుత్వం, అటు నిర్మాతల తరఫున షాడో మినిస్టరే మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. అంతా అయ్యాక లేబర్ కమిషనర్ వద్ద లాంఛన మంత్రాంగం చేసి కార్మికుల నిరసన విరమింప జేసినట్టు చెప్తున్నారు.