హనుమకొండ, మే 2: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచడంతో చిరు వ్యాపారులు, ప్రజలపై పెను భారం పడింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ అదనపు భారం మోపమని చెప్పిన కేంద్రం మాట మార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియగానే కమర్షియల్ బండపై భారం మోపింది. గత సంవత్సరకాలంగా డొమెస్టిక్ సిలిండర్లను రెండుసార్లు పెంచింది. 2025 ఏప్రిల్లో రూ.50, 2026 మార్చిలో రూ. 60 పెంచింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కొన్ని నెలలు తగ్గించినా ఎక్కువ సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం 1512.50 పెంచినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1,26,745 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇందులో ఉజ్వల 30,725, దీపం 16,450, సీఎస్ఆర్ 10,820, సాధారణ కనెక్షన్లు 68,750 ఉన్నాయి. 1,26,745 మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరుగుతున్నది.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో 4,15,359 డొమెస్టిక్, 2622 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 8,776 సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ 6,963 మాత్రమే సరఫరా చేస్తున్నారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లాలో 99,857 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో సాధారణ కనెక్షన్లు 76,558, ఉజ్వల 23,299, కమర్షియల్ 304 కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 800 నుంచి 900 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు.
జనగామ జిల్లాలో..,
జనగామ జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 1.60 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు, కమర్షియల్ 738 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం లో సాధారణంగా రోజువారీగా 300 నుంచి 400 సిలిండర్ల బుకింగ్ ఉండేది. జనగామలో ప్రతిరోజూ 524 సబ్సిడీ సిలిండర్లు సరఫరా అవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంతే మొత్తంలో సరఫరా అవుతున్నాయి.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 3,15,056 ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 1,452 ఉన్నాయి. జిల్లాలో రోజుకు 5,980 గ్యాస్ సిలిండర్ల డిమాండ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.