Dog Funeral Rites | జంతువుల్లో శునకం విశ్వాసం గల జీవి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శనుకం మరణించడంతో దశదిన కర్మ చేసి సమాధి కట్టించాడో యజమాని. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న-మంజుల దంపతులు కొన్నేళ్ల క్రితం జర్మన్ షెఫర్డ్ రకానికి చెందిన శునకాన్ని పెంచుకుంటూ వస్తున్నారు.
పది రోజుల కిందట అనారోగ్యంతో కుక్క మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం దూరమవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మనుషులకు అంత్యక్రియలు చేసిన విధంగానే శునకానికి సైతం యజమాని వీరన్న అంత్యక్రియలు నిర్వహించాడు. కుక్కకు రూ.25వేలు ఖర్చు చేసి సమాధి నిర్మించాడు. శనివారం గంగిరెద్దుల వాళ్లను పిలిపించి ఆట, పాటల నడుమ సమాధి వద్ద నివాళులర్పించారు.