మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఆగస్టు 26 : కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్నెమైన లాస్య, దేవేందర్ దంపతుల మూడేండ్ల కూతురు అనుషిత సోమవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్నది.
ఒక్కసారిగా కుక్కలు చిన్నారిపై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపర్చాయి. వెంటనే చిన్నారిని భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సిద్దిపేటకు రెఫర్ చేశారు. సిద్దిపేట ఏరియా దవాఖాన వైద్యులు మైరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.