హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : మిస్ వరల్డ్ పోటీల పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేద విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యార్థులకు నాణ్యత లేని భోజనం ఎలా అందిస్తారని బుధవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వేములవాడ దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి రూ.32 వేలకు ప్లేటు చొప్పున భోజనం తెప్పించుకొని తిన్నారని, కానీ పేద విద్యార్థులకు గొడ్డుకారం, నీళ్లచారుతో భోజనం పెడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవిష్యత్తు అయిన విద్యార్థులకు నీళ్ల సాంబార్‌తో భోజనం పెట్టడమే ప్రజాపాలనలో సాధించిన విజయమా? అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 90 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రికి కనీసం వారి మరణాలను గుర్తించే సమయం కూడా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కనీసం మనుషులుగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించదా? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించడం కూడా చేతకాదా?’ అని నిలదీశారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ 2047 గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గొడ్డుకారం, నీళ్ల సాంబారే భావిభారత పౌరులకు భోజనం అయిందని బుధవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దకుతుందని విమర్శించారు.