Election Code | కరీమాబాద్ (వరంగల్), మార్చి 1 : సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకులు ఉల్లంఘిస్తే మాత్రం పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. భారత రాజ్యాంగం, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినా పోలీసులు మిన్నకుండిపోయారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈ క్రెడిట్ తమదంటే తమదేనని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా తమ నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది.
శనివారం మామునూరు ఎయిర్పోర్టు గేటు వద్ద బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పుష్పాభిషేకం నిర్వహించి సంబురాలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు సైతం అక్కడే సంబురాలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించగా ఒకే టెంట్ కింద రెండు పార్టీల నాయకులు పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేశారు. తమ పార్టీ, అంటే తమ పార్టీ వల్లే మామునూరుకు ఎయిర్పోర్ట్ వచ్చిందంటూ ఉపన్యాసాలు దంచారు. మామునూరు ఏసీపీ తిరుపతి, సీఐ రమేశ్ పరిస్థితిని సమీక్షించారు. ఈ రెండు పార్టీల హంగామాను చూసి స్థానికులు పలు విమర్శలు చేశారు. 1981 వరకు సేవలందించిన ఎయిర్పోర్టు మూతపడిన నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, ఇన్నాళ్లు లేనిసోయి ఇప్పుడొచ్చిందా అంటూ ఎద్దేవాచేశారు.