హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతితల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది. ఏపీకి ఈ నెల 21వ తేదీలోపు 29 వేల టన్నుల యూరియా సరఫరా చేసి యూరియా కొరత తీరుస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. యూరియా కొరతపై సోమవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన ఏపీ మంత్రి నారా లోకేశ్ యూరియా సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 వరకు 29 వేల టన్నుల యూరియా సరఫరా చేస్తామని నడ్డా హామీ ఇచ్చారని లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, తాము మాత్రం పంటలకు సరిపడా యూరియా ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేశారు. రైతులు కూడా అవసరానికి మించి యూరియా కొనొద్దంటూ సుద్దులు చెప్పారు.
తెలంగాణలోనూ యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. వర్షాల్లోనూ పడిగాపులు కాస్తున్నారు. కొన్నిచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొంటే.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడగ్గానే ఏపీకి యూరియా సరఫరా చేసేందుకు అంగీకరించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఏపీ సంగతి సరే, తెలంగాణ సంగతేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ఎరువులు కేటాయించరా? అని మండిపడుతున్నారు.
ఏపీ మంత్రి లోకేశ్ ఢిల్లీ వెళ్లి యూరియా కొరతను పరిష్కరించుకోగా, తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు? మన మంత్రులకు ఢిల్లీ వెళ్లే తీరిక లేదా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏదో పనులపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం కాదని, ప్రత్యేకంగా వెళ్తేనే పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తే లాభమేమిటి? సమీక్షలతో యూరియా కొరత తీరుతుందా? అని నిలదీస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి రావాల్సిన యూరియాలో 2.98 లక్షల టన్నుల లోటు ఉన్నదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఇంత భారీ లోటు ఉన్నప్పుడు.. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో పోరాడి ఎందుకు కోటా విడుదల చేయించుకోలేకపోతున్నదని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి యూరియా కొరత, రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సీఎం, మంత్రుల వ్యవహారశైలి సైతం ఇందుకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. రా ష్ట్రంలో యూరియా కొరత ఇంత తీవ్రంగా ఉంటే దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): యూరియా కొరత కారణంగా రైతుల పంటలకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేకపోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. యూరియా సరఫరాకు పట్టాదారు పాస్ పుస్తకాలను అనుసంధానం చేయాలని, రైతులకు టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సోమవారం యూరియాపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయిందని తెలిపారు. యూరియా లోటును దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయేతర అవసరాలకు యూరియా మళ్లించకుండా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.