హుజూరాబాద్ టౌన్, జూన్ 18: మహిళకు సిజేరియన్ చేసి కుట్లు వేసే సూది (నీడిల్)ని కడుపులోనే మరిచిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో చోటుచేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మంచిర్యాలకు చెందిన సౌమ్య, సత్యనారాయణ దంపతులు. సౌమ్య ప్రసూతి కోసం జమ్మికుంటలో తల్లిగారి ఇంటికి వచ్చింది.
ఈనెల 15న ఉదయం పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు ఆమెను డెలివరీ కోసం హుజూరాబాద్ ఏరియా దవాఖానలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమెకు సిజేరియన్ చేయగా, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కుట్లు వేసే సమయంలో దారానికి ఉన్న సూది జారిపోయింది.
వెంటనే సిబ్బంది స్పందించి వెతికినా అది దొరక్కపోవడంతో అనుమానం వచ్చి ఎక్స్రే తీసి అప్పటికప్పుడే కుట్లు పూర్తికాకముందే సూదిని తొలగించినట్టు సూపరింటెండెంట్ నారాయణరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే దవాఖాన ప్రతిష్ఠను దెబ్బతీసేలా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చూపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.