హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఫోన్‌ట్యాపింగ్ కేసులో చట్ట ప్రకారమే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నదని, ఎలాంటి వేధింపులకు ఆస్కారం లేదని, సిట్ నైతికతను దెబ్బ తీయొద్దని విచారణాధికారి పీ వెంకటగిరి మంగళవారం విజ్ఞప్తిచేశారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘ట్యాపింగ్ జర్నలిస్టులకు వేధింపులు’ శిర్షికన ప్రచురితమైన వార్తను సిట్ తీవ్రంగా ఖండించింది. అందులో పేర్కొన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకమైనవని సిట్ పేర్కొంది. ఎస్ఐబీ వనరుల దుర్వినియోగం, అక్రమ టెలిఫోన్ ఇంటర్సెప్షన్ (ఫోన్ ట్యాపింగ్), సాక్ష్యాల నాశనం వంటి తీవ్రమైన నేరాలపై ఉన్నతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతున్నదని సిట్ తెలిపింది.
ఈ విచారణ పూర్తిగా చట్ట నిబంధనలు, చట్టపరమైన విధివిధానాలకు లోబడే సాగుతున్నదని స్పష్టంచేసింది. ‘కేసుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు, పరిస్థితులపై అవగాహన ఉన్న ఇద్దరు జర్నలిస్టులను దర్యాప్తులో భాగంగా విచారించాం. వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, స్వచ్ఛందంగా విచారణకు సహకరించారు. అలాంటప్పుడు జర్నలిస్టులను వేధిస్తున్నారనడం పూర్తిగా కల్పితం’ అని సిట్ వివరించింది. ఒక సున్నితమైన కేసులో నిజాలను నిగ్గుతేల్చేందుకు శ్రమిస్తున్న దర్యాప్తు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి అక్రమ ఉద్దేశాలను ఆపాదించడంపై సిట్ మండిపడింది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అబద్ధపు ప్రచారాన్ని సృష్టించడానికి, చట్టపరమైన విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నంగా అభివర్ణించింది. ఇటువంటి వార్తలు రాసేటప్పుడు సిట్, పోలీసుశాఖ నుంచి వివరణ తీసుకోవాలని కోరింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ఇలాంటి నిరాధార వార్తల ప్రచురణను నిలిపివేయాలని మీడియాకు సూచించింది.