ఫేక్ న్యూస్‌లో బీజేపీకి నోబెల్

- సోషల్ మీడియాను ఫేక్ మీడియాగా మార్చారు
- టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని అసత్య ప్రచారం
- ఈ దొంగ వీడియోలకు ప్రముఖ టీవీ చానెళ్ల లోగోలు
- దుబ్బాక పోలింగ్ సమయంలోనూ ఇదే విధమైన కుట్ర
- పాత వీడియోలతో మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం
- కమలనాథుల కుట్రలను తిప్పికొట్టాలి
- మంత్రి హరీశ్‌రావు పిలుపు
సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఫేక్ వీడియోలు, అబద్ధపు ప్రచారాలతో బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని, దాని వలలో పడవద్దని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు పొందేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పలువురు కేంద్ర మంత్రులు, ఓ ముఖ్యమంత్రిని హైదరాబాద్ రప్పించినప్పటికీ ప్రజల్లో స్పందన కనిపించకపోవడంతో చివరి అస్త్రంగా ఫేక్ వీడియోలు విడుదల చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా, పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు టీవీ9 లోగోతో ఒక ఫేక్ వీడియో సృష్టించి ప్రజల్లోకి వదిలిందని హరీశ్‌రావు తెలిపారు.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే కుయుక్తిని పన్నుతున్నట్టు తెలిసిందని చెప్పారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు బీజేపీలో చేరనున్నట్టు ప్రముఖ టీవీ చానెళ్ల లోగోలతో ఫేక్ వీడియోలు సిద్ధం చేసినట్టు తమకు సమాచారముందని తెలిపారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు గతంలో కూడా హిందువుల ఆలయాల్లో మాంసం పడేసినట్టు వీడియోలు వదిలారని, అలాంటి వాటిని మళ్లీ విడుదల చేయనున్నట్టు తెలిసిందని, వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు. తమ స్వార్థం కోసం కులాలను, మతాలను కూడా వాడుకుంటారని మండిపడ్డారు. ఫేక్ మీడియాను నడుపడంలో అవార్డులు ఇవ్వాల్సి వస్తే బీజేపీకి ‘నోబెల్' బహుమతి వస్తుందని ఎద్దేవాచేశారు. ఫేక్ వీడియోలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
ఓటమి భయంతోనే ఈసీ ఆఫీసు ముందుధర్నా
గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం తప్పదన్న భయంతోనే బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. వారి ధర్నా ఒక డ్రామా అని అభివర్ణించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా విజ్ఞులైన నగర ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉంటారని, టీఆర్ఎస్ కార్పొరేటర్లను భారీ మెజార్టీతో గెలిపిస్తారని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు.
రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలు పెంచాలి
పార్టీలు చేసే రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను పెంచేలా ఉండాలని, కానీ విచిత్రంగా బీజేపీ ప్రజాస్వామ్య విలువలు హరించేలా వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘గ్రేటర్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రచారం చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ నగర మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయనున్నదో వివరించారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తాము చేసిన అభివృద్ధిని, తమ విధానాలను ప్రచారం చేసుకుంటాయి. కానీ బీజేపీ మాత్రం పూర్తిగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసింది. ఓట్ల కోసం ఆ పార్టీ నాయకులు కుటిల, దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. తమ విధానాలను బీజేపీ నాయకులు ఎక్కడ చెప్పుకోలేదు. బీజేపీ కుటిల రాజకీయాలను తిప్పికొట్టి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలే గెలిపించుకుంటారు’ అని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘మంత్రినైన నేను లేదా టీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ లేదా ఎమ్మెల్యే బీజేపీలో చేరనున్నారని పోలింగ్ సందర్భంగా ఫేక్ వీడియోలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వీడియోలకు ప్రముఖ టీవీ చానెళ్ల లోగోలు వాడుతారు. వాటిని నమ్మొద్దు. ఆ వీడియోల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. వాటిని ఒకరి నుంచి ఇంకొకరికి పంపొద్దు. సోషల్ మీడియాను బీజేపీ ఫేక్ మీడియాగా మార్చివేసింది. సామాజిక మాధ్యమాలను బీజేపీ పూర్తిగా నాశనం చేసింది’
- మంత్రి హరీశ్‌రావు