KTR | ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని శైలజ చనిపోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి చెందిన విద్యార్థి శైలజ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వమే తల్లితండ్రి అయి చూసుకుంటుందని పిల్లలను తల్లితండ్రులు గురుకులాలకు పంపిస్తే… 48 మంది పేద పిల్లలను పొట్టన బెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి మామూలు మరణాలు కాదు. ప్రభుత్వం చేయించిన హత్యలుగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు.
నా నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట్లో ఓ విద్యార్థి గురుకుల పాఠశాలలో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఆ తల్లితండ్రులు తమలాంటి కడపుకోత వేరే వారికి రాకుండా పోరాడాలని కోరారని కేటీఆర్ తెలిపారు.మేము ఆనాటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ… గురుకులాల విద్యార్థుల అంశాన్ని గుర్తు చేస్తూనే ఉన్నామని తెలిపారు. కానీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం. ఆ కుటుంబాల తరఫున శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని స్పష్టం చేశారు. కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. నిబ్బరంగా ఉండాలని సూచించారు.