హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూ శుక్రవారం లేఖను విడుదల చేశారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం-రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని సీఎం కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న,రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు,రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రిత తెలిపారు.
ఈ నూతన సంస్కరణలతో రాష్ట్ర వ్యవసాయ రూపమే పూర్తిగా మారిపోయింది. కరువుతో అల్లాడిన నేల నేడు పచ్చని పైరులతో, ధాన్యపు రాశులతో కళకళలాడుతోంది. దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా అనతి కాలంలోనే అవతరించింది. తెలంగాణ రైతాంగాన్ని దేశానికే దిక్సూచిగా మలచాలన్న సీఎం కేసీఆర్ ఆశయం, వారి అపార కృషి, పట్టుదల కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
కానీ…రైతులను ఆదుకోవడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతును అరిగోస పెడుతున్నది. తమ కార్పొరేట్ మిత్ర శక్తుల ప్రయోజనం కోసం దేశ వ్యవసాయాన్ని, అన్న దాత బతుకును తాకట్టు పెడుతున్నది. రైతులను కూలీలుగా మార్చే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు.
పండగలపూట ఎరువుల ధరలు 3 నెలల కాలంలోనే 50% నుండి 100% వరకు పెంచి రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు. ప్రశ్నించిన రైతులను తొక్కి చంపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతును పూర్తి అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. మోసపోతే-గోస పడతామన్నారు.
తెలంగాణ రైతుల పట్ల బిజెపి నిర్లక్ష్యపు వైఖరి ఢిల్లీ వేదికగా నేను స్వయంగా చూసాను. మా రాష్ట్ర పంట కొనుగోలు చేయాలని మంత్రుల బృందం ఢిల్లీలో పడిగాపులు కాసింది. నేను బృందంలో సభ్యుడిగా కేంద్రాన్ని మన రాష్ట్ర హక్కును ప్రశ్నించానని తెలిపారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేయాలి. సీఎం రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిందే అని డిమాండ్ చేశారు. బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర రైతన్నలు ఆలోచన చేయాలని, పోరాటానికి సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.