అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా-బయటా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్‌తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించింది. అదానీ కంపెనీతో గతంలో చేసుకొన్న విద్యుత్తు ‘స్మార్ట్ మీటర్ల’ డీల్‌ను పొత్తు ధర్మంలో భాగంగా తాజాగా రద్దు చేసుకొన్నది.
కానీ… కూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదానీకి సీఎం రేవంత్ రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వందకోట్ల విరాళాన్ని వాపస్ చేసిన సీఎం.. ఒప్పందాల విషయంలో అదానీకే మద్దతుగా నిలుస్తున్నారు. అంబుజా సిమెంట్ ప్లాంట్, ఫార్మా కంపెనీ, పాతబస్తీ కరెంటు బిల్లులు సహా పలు ఒప్పందాల్లో రేవంత్ ప్రభుత్వం ఇంకా అంటకాగుతుండటం గమనార్హం.
Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఇండి యా కూటమి నేతలు నిత్యం కేంద్రంపై దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని రేవంత్ ప్రభు త్వం మాత్రం అదానీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నది. ఇక, ప్రతిపక్ష ఇండి యా కూటమిలోని డీఎంకే పార్టీ మాత్రం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీతో తెగదెంపులకు సిద్ధమైతే, కాంగ్రెస్ విధానాలను పాటించాల్సిన రేవంత్ ప్రభుత్వం మాత్రం అందుకువిరుద్ధంగా అదానీతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగిస్తున్నది. స్మార్ట్‌మీటర్ల పేరిట విద్యుత్తు రంగంలో విస్తరించాలనుకొంటున్న అదానీ గ్రూప్‌నకు తమిళనాడు సర్కారు కరెంట్ షాక్ ఇచ్చింది. 2023 ఆగస్టులో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్)తో చేసుకొన్న ‘స్మార్ట్ మీటర్ల’ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు 2024 డిసెంబర్ 27న టెండర్లను రద్దు చేసినట్టు తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టీఏఎన్జీఈడీసీవో) తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టులో భాగంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో స్మార్ట్‌మీటర్ల కోసం 2023 ఆగస్టులో బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఈఎస్ఎల్ కంపెనీ మిగతా కంపెనీల కంటే తక్కువ ధరను కోట్ చేసింది. దీంతో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు సహా మొత్తం 8 జిల్లాల్లో స్మార్ట్‌మీటర్ల సరఫరా, బిగింపు, రీడింగ్, బిల్లుల వసూలుకు సంబంధించిన నాలుగు కాంట్రాక్ట్‌లను అదానీ కంపెనీకి అక్కడి ప్రభుత్వం అప్పగించింది. అయితే, స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్ట్ దక్కించుకొన్న ఏఈఎస్ఎల్ కంపెనీ ఇంతకుముందు మహారాష్ట్ర, బీహార్‌లోనూ ఈ కాంట్రాక్ట్‌లను దక్కించుకొన్నది. దీంతో ఒక్కో స్మార్ట్‌మీటర్‌కు అక్కడ కంపెనీ ఎంత కోట్ చేసిందన్న విషయంపై టీఏఎన్జీఈడీసీవో అధికారులు ఆరా తీశారు. ఒక్కో స్మార్ట్‌మీటర్‌కు బయటి రాష్ర్టాల కంటే తమ దగ్గర రూ.120 చొప్పున అదానీ కంపెనీ ఎక్కువ వసూలు చేస్తున్నదని అధికారికవర్గాలు గుర్తించాయి. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం.. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన మొత్తం నాలుగు స్మార్ట్‌మీటర్ కాంట్రాక్టులను తాజాగా రద్దు చేసింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించి కొత్త టెండర్లను త్వరలోనే పిలుస్తామని టీఏఎన్జీఈడీసీవో అధికారులు తెలిపారు.
ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్యపక్షంగా ఉన్న డీఎంకే.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమి పాలసీకి కట్టుబడి అదానీతో తెగదెంపులు చేసుకున్నది. అయితే, కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వం వైఖరి అదానీకి అనుకూలంగా ఉండటం విస్మయం కలిగిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదానీతో రేవంత్ బంధం బలపడుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు, సిమెంట్, డాటా సెంటర్లు తదితర రంగాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గత జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం రేవంత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డాటా సెంటర్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రెండు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు, రక్షణ రంగంలో ఆర్అండ్డీ ఎకోసిస్టం ఏర్పాటుకు రూ.వెయ్యి కోట్లు, సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అదానీకి చెందిన అంబుజా సిమెంట్ రామన్నపేటలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సిమెంట్ పరిశ్రమ వద్దంటూ స్థానికులు ఎన్ని నిరసనలు చేపట్టినా రేవంత్ సర్కారు మాత్రం ఏకపక్షంగానే ముందుకు వెళ్తున్నది. మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ఇప్పటికే అదానీకి అప్పగించినట్టు వార్తలొస్తున్నాయి. ఆ గ్రూప్‌నకు చెందిన సిబ్బంది ఇటీవల పాతబస్తీలో కరెంట్ మీటర్ల వివరాలను సేకరించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక, రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు రూ.100 కోట్లు విరాళం ఇవ్వడం.. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో రేవంత్ ప్రభుత్వం ఆ విరాళాన్ని ఇష్టంలేకపోయినా వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే.
దేశంలో సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ.2,029 కోట్లు ముడుపులు ఇచ్చారంటూ అమెరికాలోని ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో గత నవంబర్‌లో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. అలాగే, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకవతకలు జరిగాయంటూ అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ కూడా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో అదానీ అక్రమాలపై చర్చించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు కేంద్రాన్ని పట్టుబట్టారు. కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ నేతలు అదానీ చర్యలను ఎండగట్టారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. ఇండియా కూటమిలోనే భాగస్వామిగా ఉన్నది. అదానీతో చేసుకొన్న ‘స్మార్ట్ మీటర్ల’ డీల్‌ను అప్పటికే స్టాలిన్ సర్కారు సమీక్షిస్తున్నది. ఈ క్రమంలో ‘స్మార్ట్ మీటర్ల’ కాంట్రాక్ట్‌లో అధిక ధరల వ్యవహారం బయటపడింది. దీంతో సంకీర్ణ ధర్మానికి కట్టుబడిన స్టాలిన్ సర్కారు.. అదానీతో డీల్‌ను వెంటనే రద్దు చేసుకొని తన నిబద్ధతను చాటుకున్నది.