Telangana | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని ఆగంజేసేందుకు తెలంగాణపైకి డీకే శివకుమార్ బ్యాచ్ దండెత్తుకొని వస్తున్నది. పచ్చని తెలంగాణను మరో కర్ణాటక కుంపటిలా మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణపై దాడికి కర్ణాటక కాంగ్రెస్ దండు కదిలింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా కర్ణాటక నేతల చెప్పు చేతుల్లోకి వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. చేరికలైనా, టికట్లైనా, హామీలైనా, పంపకాలైనా ఏదైనా సరే కన్నడ నాయకుల ఆదేశాల అనుసారమే జరుగుతున్నవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా తెలంగాణపై దాడికి తెగబడేందుకు కుట్రకు తెరలేపారు.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో ఆ పార్టీ తరుఫున ఎన్నికల పరిశీలకులుగా మొత్తం కర్ణాటక నేతలనే నియమించింది. 10 మంది క్లస్టర్ ఇన్‌చార్జీలతోపాటు 48 నియోజకవర్గాలకుగానూ మొత్తం 58 మందిని పరిశీలకులుగా నియమించింది. వీళ్లంతా కూడా కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో మెజార్టీ నేతలు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినవారే. దీన్నిబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దండయాత్రకు కర్ణాటక నేతలను పురిగొల్పుతున్నదనే విషయం స్పష్టమవుతున్నది. ఒక్క కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారినే పరిశీలకులుగా నియమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక కుట్రల ఫార్ములాను తెలంగాణలో అమలు చేయడానికే ఇలా చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమలు చేయలేని ఇబ్బడి ముబ్బడి హామీలను కుమ్మరించి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఆ పార్టీకి తెలిసినప్పటికీ అధికారం ‘చే’జిక్కిచుకోవడడమే లక్ష్యంగా హామీలను కురిపించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కన్నడనాట కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు ఏడు గంటల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నది.
గతంలో 40 శాతం ఉన్న కమీషన్ ఇప్పుడు 50 శాతానికి పెరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సీఎం కుర్చీ కోసం నేతల మధ్య కయ్యం మొదలైంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కుర్చీ కోసం కొట్లాటతో కర్ణాటకలో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. కర్ణాటక రాష్ర్టాన్ని విజయవంతంగా భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణను కూడా ఆగంజేసేందుకు కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగానే గెలుపు కోసం కర్ణాటక కుట్రలను తెలంగాణలో అమలు చేసేందుకు కుతంత్రాలు పన్నుతున్నది. అందుకే గత ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను విజయవంతంగా మోసం చేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను తెలంగాణపై దాడికి పురిగొల్పుతున్నది. తద్వారా తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ర్టాన్ని కుట్రలు, కుతంత్రాలకు నెలవుగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వినిపి స్తున్నాయి. ఇందుకోసం ఎన్నికలను వేదికగా మార్చుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ కోసం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు రాష్ట్రంలోకి చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఇద్దరు కీలక నేతల సన్నిహితుల ఇండ్లలో కోట్ల కొద్ది డబ్బులను అక్కడి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ హైదరాబాద్‌పైనా విషం కక్కుతున్నది.
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకొనేందుకుగానూ కుట్రలకు తెరలేపింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పలు పరిశ్రమలకు లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రఖ్యాత కంపెనీలను కర్ణాటకు రావాల్సిందిగా ఆహ్వానించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను కొనుగోలుకు కుట్రలు చేస్తూనే మరోవైపు హైదరాబాద్, తెలంగాణలోని పరిశ్రమలను తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.