హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో మొత్తం 59 షెడ్యూల్డ్ కులాలు ఉండగా, ఇప్పటివరకు ఆ కులాలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్లను గంపగుత్తగా అమలుచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలను వాటిని జనాభా, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా మూడు గ్రూపులుగా వర్గీకరించి, 15% రిజర్వేషన్లను ఆ మేరకు పంచింది. గ్రూప్-ఏ లో 15 ఉపకులాలను చేర్చి వారికి 1%, గ్రూప్-బీలో మాదిగ తదితర 18 కులాలను చేర్చి 9%, గ్రూప్-సీలో మాల తదితర 26 కులాలను చేర్చి 5% రిజర్వేషన్లు కల్పించింది.
ఈ మేరకు తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం- 2025ను చేసింది. గెజిట్ను కూడా విడుదల చేసి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, తాజా జనాభా గణాంకాలను కాకుండా 2011లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన గణాంకాల ఆధారంగా వర్గీకరణ చేపట్టిందని పలు దళితసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.