Devannapeta Pump House | వరంగల్, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎట్టకేలకు దేవన్నపేట పంపుహౌజ్ మోటర్లు గురువారం ప్రారంభమయ్యాయి. ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు చేరుతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా సాగునీటి నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పంటలకు నీరిచ్చేందుకు అపసోపాలు పడుతున్నది. దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో దేవన్నపేట పంపుహౌజ్‌లో 10 రోజులుగా అనేక ప్రయత్నాల అనంతరం ఒక మోటర్ ఆన్ అయ్యింది. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసింది. దేవాదుల ప్రాజెక్టు రెండు దశల్లోని పంపింగ్‌తో రిజర్వాయర్ నిండేందుకు నెలరోజులు పట్టేది. మూడోదశలోని దేవన్నపేట పంపుహౌజ్తో వారంలోనే ధర్మసాగర్ రిజర్వాయర్ నింపే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఒత్తిడితో దేవాదుల పరిధిలోని యాసంగిలో పంటలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చివరిదశలో ఆలోచించింది.
సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 18న దేవన్నపేట పంపుహౌజ్ వద్దకు వచ్చి మోటర్లను ఆన్ చేసేందుకు ప్రయత్నించారు. నిర్వహణ లేమితో ఆ రోజు పంపులు ఆన్‌కాలేదు. ఆస్ట్రియా కంపెనీ ఇంజినీర్లు వచ్చి పరిశీలించిన అనంతరం గురువారం పంపింగ్ మొదలైంది. అధికారుల సమాచారం మేరకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి వచ్చి ఒక మోటరును ఆన్‌చేయగా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు చేరుతున్నాయి.
యాసంగి పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతోనే దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో పంపింగ్ చేపట్టినట్టు సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేవన్నపేట పంపుహౌజ్‌లోని మోటర్‌ను ఆన్ చేసిన అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించి నీటి విడుదలను పరిశీలించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మూడు దశల పనులను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. దేవన్నపేట పంపుహౌజ్‌లో మూడు మోటర్లు ఉన్నాయని, ఒక పంపుతో 650 క్యూసెకుల నీరు పంపింగ్ అవుతుందని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 15 రోజుల క్రితమే పంపులు ఆన్ చేయాల్సి ఉన్నదని, ఆలస్యం కావడంతో 50 నుంచి 100 ఎకరాల్లో వరి పంట ఎండి నష్టం వాటిల్లినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అధికారులు పాల్గొన్నారు.
దేవాదుల ప్రాజెక్టు పనులు ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయి. 2001 నుంచి 2014 వరకు సమైక్య ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5.57లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించేలా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిలోని దేవాదుల ప్రాజెక్టు పంపుహౌజ్ నుంచి మూడు మార్గాల్లో హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు పంపింగ్ జరిగేలా మార్పులు చేశారు. అప్పటివరకు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే గోదావరి నుంచి నీరు ఎత్తిపోతలకు అవకాశం ఉండేది. దేవాదుల పంపుహౌజ్‌కు దిగువన కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సమ్మక్క బరాజ్‌తో ఏడాది పొడవునా పంపింగ్‌కు నీరు అందుబాటులోకి వచ్చింది.