హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా స్టేజ్-1 ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీశైలం నుంచి 11టీఎంసీలను మళ్లించేందుకు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. లాంఛనంగా ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వరద ఆధారితంగా నిర్మించిన ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం వరద లేకున్నా కూడా నీటిని తరలించేందుకు ఏపీ సిద్ధమవుతున్నా తెలంగాణ సర్కార్ మాత్రం మౌనంగానే ఉండిపోయింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.38లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టారు. 1994లో డీపీఆర్‌ను సిద్ధం చేశారు.
ఆ తర్వాత 2005 ఆగస్టులో వైఎస్సార్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కృష్ణాలో వరద కొనసాగుతున్న సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ 841 ఫీట్ల వద్ద బ్యాక్‌వాటర్ నుంచే 43 టీఎంసీలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం కొల్లంవాగుపై ఇంటెక్ పాయింట్ హెడ్ రెగ్యులేటరీ నిర్మించారు. అప్రోచ్ చానల్ ద్వారా జంట సొరంగాలకు, అక్కడినుంచి ఫీడర్ చానల్‌కు, ఆపై ప్రకాశం జిల్లాలో 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు తరలిస్తారు. అకడినుంచి కాలువలకు మళ్లించి నీరందిస్తారు. ప్రాజెక్టును మొత్తంగా రెండు ఫేజ్‌లుగా చేపట్టారు. స్టేజ్-1లో భాగంగా శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు 11.43 టీఎంసీలను తరలించాలి. స్టేజ్-2లో నల్లమలసాగర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా మూడు జిల్లాలకు నీరందించాలి. ప్రస్తుతం స్టేజ్-1 పనులు పూర్తయ్యాయి.

నీళ్లు ఎత్తుకెళ్తున్నా నిలువరించని సర్కార్
శ్రీశైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్(ఎస్ఆర్బీసీ) 19 టీఎంసీలు మొత్తంగా 34 టీఎంసీల మళ్లింపునకే ఏపీకి అనుమతి ఉన్నది. ఉమ్మడి పాలకులు వరద జలాల పేరిట హెచ్ఎస్ఎస్ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి), జీఎన్ ఎస్ఎస్(గాలేరు నగరి సుజల స్రవంతి), మల్యాల, ముచ్చుమర్రి ఇతరత్రా లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తరలిస్తున్నది. అదే కోవలో వెలిగొండ నుంచి కూడా నీళ్లు మళ్లించేందుకు రెడీ అవుతున్నది. కానీ వెలిగొండ ప్రాజెక్టును సైతం వరద జలాల ఆధారంగా చేపట్టారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ నిండి, సముద్రానికి వృథాగా పోయే సమయంలో 30రోజుల్లో 43 టీఎంసీలను తరలించాలి. కానీ ప్రస్తుతం కృష్ణాబేసిన్‌లో సాధారణం కంటే 45శాతం లోటు వర్షపాతం నమోదైంది. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లు సైతం పూర్తిగా నిండలేదు. కానీ ఏపీ సర్కార్ వెలిగొండ ద్వారా అదనంగా కృష్ణాజలాల తరలింపునకు సిద్ధమైంది. అనుమతులు లేకున్నా, వరద రాకున్నా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి నీళ్లు ఎత్తుకెళ్లేందుకు ఏపీ సిద్ధమైనా నిలువరించాల్సిన రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తున్నది. నీటి నిర్వహణను పర్యవేక్షించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నది.