Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): రిజర్వు బ్యాంకును గ్యారెంటర్‌గా పెట్టి ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తీసుకోవడం రాష్ర్టానికి లాభదాయకమా? లేక నష్టమా? అన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆర్బీఐ పూచీకత్తుగా ఉన్న నేపథ్యంలో ఇకపై మూడు నెలలకోసారి వడ్డీ చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడి చెల్లించకపోతే.. ఆ మొత్తాన్ని రాష్ర్టానికి రావాల్సిన కేంద్ర నిధుల నుంచి మళ్లించే అవకాశం ఉన్నదని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ సంస్థ 2010లో ముందుకు వచ్చింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 18 వేల కోట్లు కాగా ఎల్ అండ్ టీ సంస్థ వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి సుమారు రూ.12వేల కోట్లు రుణంగా తీసుకున్నది. మిగిలిన మొత్తాన్ని ఎల్ అండ్ టీ తన ఈక్విటీ రూపంలో, కేంద్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద అందించిన నిధులతో ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
కట్టింది ఎంత… మిగిలింది ఎంత?
మెట్రో రైలు 2017 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 2020 నాటికి ఎల్ అండ్ టీ సంస్థ మూడు కారిడార్లను పూర్తిచేసింది. ఈ ఏడేండ్ల పాటు బ్యాంకులకు వడ్డీలు, అసలు రూపంలో ఈఎంఐలూ చెల్లిస్తూ వచ్చింది. కరోనా లాక్డౌన్ నష్టాలు, ఆశించిన స్థాయిలో లేని ప్రయాణికుల ఆదరణతో నిత్యం నష్టాల భారం కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.2వేల కోట్ల వరకు అప్పును తిరిగి చెల్లించింది. మిగిలిన అప్పుతోపాటు మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం చేసుకున్నది. ఆ మిగిలిన అప్పు రూ.13,600 కోట్లకు ఇప్పుడు రీఫైనాన్స్ జరిగింది. భారీ నిర్వహణ వ్యయంతో ప్రాజెక్టు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఏటా వందల కోట్ల వడ్డీలు చెల్లించలేక, నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడింది. బ్యాంకుల కన్సార్షియానికి ఎల్అండ్టీ గతంలో సుమారు 8.5% నుంచి 9.5% వరకు వడ్డీ చెల్లించినట్టు సమాచారం.
ఐఆర్ఎఫ్సీ రుణం భారం ఎవరిమీద
ఎల్ అండ్ టీ సంస్థ తన వాటా రూ.1,400 కోట్లు నిర్ణీత గడువు కంటే ముందే తీసుకొని మెట్రో నుంచి బయటపడింది. కానీ ఎల్ అండ్ టీ తీసుకున్న అప్పు రూ.13,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పడ్డాయి. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న వడ్డీ రేటు కంటే 30 శాతం తక్కువకు (దాదాపు 6-7శాతం) ఐఆర్ఎఫ్సీ నుంచి తీసుకున్నది. ఇప్పటికే రూ.1,400 కోట్ల ఎగ్జిట్ గిఫ్ట్‌ను ఎల్ అండ్ టీ చేతిలో పెట్టిన సర్కార్.. పాత అప్పును తిరిగి తీసుకొని ఏదో సాధించినట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే మారిపోతుందనే స్థాయిలో గొప్పలు చెప్పుకొంటున్నది. వాస్తవానికి రీ ఫైనాన్స్ ద్వారా వచ్చే వెసులుబాటుతో రాష్ట్ర సర్కార్ కట్టే రుణ భారం తగ్గుతుందే తప్ప.. ఉన్న అప్పు మంచుగడ్డలా కరిగిపోదు. ఈ అప్పును, దానిపై వడ్డీ భారాన్ని ప్రభు త్వం ప్రజల నెత్తిన పెడుతుంది.
రాష్ర్టానికి తొందరెందుకు ?
నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం 60 ఏండ్లపాటు ఎల్ అండ్ టీ సంస్థ దీని లాభనష్టాలను చూసుకోవాలి. ఆ తర్వాతే ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎల్ అండ్‌టీ సంస్థను బయటకు పంపడానికి అదనంగా రూ.1,400 ఓట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టింది. 60 ఏండ్ల తర్వాత ఉచితంగా రావాల్సిన ప్రాజెక్టును, ఇప్పుడే వేలకోట్ల అప్పులతో కలిపి ప్రభుత్వం ఎందుకు నెత్తిన వేసుకున్నట్టు? మెట్రో చేతిలో ఉన్న వేల కోట్ల విలువైన భూములేనన్న అనుమానం వ్యక్తమవుతున్నది. మెట్రో భూములు, ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే క్రమంలోనే ఈ హడావుడి అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కేంద్రం పూచీకత్తుతో ఆర్బీఐ చేతిలో కత్తి
రీఫైనాన్స్ అంటూ సర్కార్ చెప్తున్న మాటలు తేనె పూసిన కత్తి లాంటివేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని కేంద్రం ఇచ్చే పూచీకత్తుతో ఆర్బీఐ రాష్ట్ర సర్కార్‌పై కత్తి దూయనుంది. కండిషన్స్ అప్లయ్ అంటూ ఆర్బీఐకి ఇచ్చిన మాండేట్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోంచి నేరుగా డబ్బులు లాక్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంతో ఆర్బీఐ చేతిలో ఉన్న కత్తితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తున్నది.