హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసిన తర్వాత దాఖలైన రివ్యూ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేట్ ఫిర్యాదును కొట్టేస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రివిజన్ పిటిషన్ విచారణార్హమో కాదో జిల్లా కోర్టు తేల్చాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ లక్ష్మణ్ మంగళవారం తీర్పు వెలువరించారు. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయడంతో ఫిర్యాది నాగవల్లి రామలింగమూర్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసు లు జారీచేసింది. నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. సెషన్స్ జడ్జి తన ముందున్న పిటిషన్ విచారణార్హమా కాదా అనే అంశానికి మాత్రమే పరిమితం కావాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు, భవనాల జాబితాను వెల్లడించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ప్రభుత్వం నిబంధనల ప్రకారం గెజిట్ విడుదల చేశాక నిషేధిత ఆస్తుల జాబితాను వెల్లడించాలని పిటిషనర్ చంద్రసేనారెడ్డి వాదించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఆ ఆస్తుల వివరాలను స్థానిక కార్యాలయాల్లో అందుబాటులో ఉంచితే ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, అలాంటి ఆస్తులను కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడతారని తెలిపారు. దీంతో ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు, భవనాల జాబితాను ప్రకటించడంపై అభ్యంతరాలేమైనా ఉంటే చెప్పాలని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.