వికారాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ఆయనో మంత్రి కాదు! ఎంపీ.. ఎమ్మెల్యే అంతకన్నా కాదు! సర్పంచ్.. చివరికి వార్డు మెంబర్ కూడా కాదు! కానీ, ఆయన వస్తున్నాడంటే అధికారయంత్రాంగం మొత్తం కదులుతుంది. సాక్షాత్తూ ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఎదురొచ్చి చేతులు కట్టుకొని నిలబడి.. పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతిస్తారు. ఎండలో చెప్పులు లేకుండా పాఠశాల విద్యార్థులు పరేడ్ చేస్తారు.. బ్యాండు వాయించుకుంటూ ఎదుర్కోలు పలుకుతారు. ఇన్ని రాచమర్యాదలు అందుకుంటున్న ఆయనకు ఉన్న హోదా ‘ఏమిటీ’ అంటే.. ఆయన ‘సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు’! రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఉంటే.. వికారాబాద్ జిల్లాకు ఆయన అన్న తిరుపతిరెడ్డే సీఎం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడనేందుకు గత డిసెంబర్ 26న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటనే మరో నిదర్శనంగా నిలిచింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది ‘ప్రజాపాలనా లేక కుటుంబ పాలనా?’ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిసెంబర్ 26న కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారీ కాన్వాయ్‌తో ఎనుముల తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఆయన రాగానే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఇతర ఉన్నతాధికారులు సైతం పుష్పగుచ్ఛాలు అందించి అధికారిక మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతిరెడ్డి ఉన్నంత సేపూ కలెక్టర్ ఆయన వెంటే తిరుగుతూ కనిపించారు. అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే గురుకుల పాఠశాల పిల్లలను ఎండలో బూట్లు లేకుండా నిలబెట్టి ఏ హోదాలేని తిరుపతిరెడ్డికి ఓ రాష్ట్రపతికో.. ప్రధానమంత్రికో.. ముఖ్యమంత్రికో చేసినట్టుగా పరేడ్ చేయించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇలా విద్యార్థులకు బూట్లు తీసేసి ఎండలో నిలబెట్టి పరేడ్‌తో స్వాగతం పలకడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిరెడ్డి వస్తున్నాడని గంట ముందు నుంచే విద్యార్థులను ఎండలో నిలబెట్టి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా నెటిజెన్లు మండిపడుతున్నారు. ‘ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూ రాష్ట్రంలో కుటుంబపాలన సాగిస్తున్నరు’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తిరుపతిరెడ్డికి ఎలాంటి పదవీ లేదు. అయినా వికారాబాద్ జిల్లాకు ఆయనే సీఎంగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులను మించి ఆయనకు పోలీస్ కాన్వాయ్, బందోబస్తు కల్పిస్తున్నారని, ఆయనతో చర్చించకుండా ఉన్నతాధికారులు ఏ నిర్ణయం కూడా తీసుకోవడం లేదని, తిరుపతిరెడ్డిని కాదని ఏ కార్యక్రమం చేసినా మరుసటిరోజు బదిలీ ఖాయమనే పరిస్థితి ఉన్నదని జిల్లాలో బాహాటంగానే చర్చ నడుస్తున్నది. జిల్లాలో పోలీసు శాఖతోపాటు అన్నిశాఖల అధికారుల పోస్టింగ్‌లు కూడా తిరుపతిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ప్రచారంలో ఉన్నది. ఫార్మా కంపెనీ వద్దంటూ అధికారులపై తిరగబడిన లగచర్ల ఘటనలో కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నా వారిని కేసు నుంచి తిరుపతిరెడ్డే బయటపడేశారని, ఎట్టిపరిస్థితుల్లోనూ భూములివ్వాల్సిందేనని గిరిజనులపై బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా కావాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇతర అధికారిక సమావేశాలు తిరుపతిరెడ్డితోనే చేయిస్తున్నారు. లగచర్ల ఘటనపై గతనెల కలెక్టర్‌ను కలిసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్ కల్పించడం వివాదస్పదమైంది. కలెక్టరేట్‌కు వచ్చిన తిరుపతిరెడ్డికి కలెక్టర్ ప్రతీక్తోపాటు అదనపు కలెక్టర్ స్వాగతం పలకడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ‘రాష్ర్టానికి అరడజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అది తెలంగాణ ప్రజల అదృష్టం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఒక్క సీఎంను ఎన్నుకుంటే వన్ ప్లస్ 6 ఆఫర్లా సీఎం వ్యవస్థ తెలంగాణలో వచ్చింది.. ఇటువంటి సౌకర్యం భారతదేశంలో ఎక్కడా లేదు’ అని దెప్పిపొడిచారు. వికారాబాద్ జిల్లాలో ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డికి సమస్త అధికార యంత్రాంగం, విద్యార్థులు ఊరి పొలిమేరల నుంచి గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చి స్వాగతం పలికిన వీడియోను కేటీఆర్ శుక్రవారం ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు. ‘వికారాబాద్ సీఎం తిరుపతిరెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నిత్యం ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న క్రమంలో ఎనుముల కుటుంబంలో ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందో ఎంచుకొనే అవకాశం ఉంటే పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
‘ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని.. ఎన్నో త్యాగాలు చేసి వచ్చే అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రజాసేవలో తమ పరిణతిని, బుద్ధి కుశలతను ప్రదర్శించాలి. అప్పుడే ప్రజల్లో అధికారులపై గౌరవ భావం ఏర్పడుతుంది. భారత జాతీయ చిహ్నం మూడు సింహాలు తలెత్తుకొని ప్రజలపై మనకుండే బాధ్యతను గుర్తుచేస్తాయి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇది అధికారులు తెలుసుకోవాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ‘ప్రతీక్ జైన్ గతంలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా ఎంతో మంచి పేరున్న నిక్కచ్చి అధికారిగా పని చేశారు. కానీ తలవంచి దండాలు పెట్టడం.. అర్హతలేని, కనీసం ప్రజలతో వార్డ్మెంబర్గా కూడా ఎన్నికకాని వ్యక్తులకు రెడ్ కార్పెట్ వేసి తనతో తీసుకెళ్తూ చదువుకునే చిన్నారులతో సెల్యూట్లు కొట్టించడం.. ఇది దేనికి చిహ్నం?’ అని శుక్రవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు.‘ఐఏఎస్ అధికారుల పనితీరును పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఇది గమనించటం లేదా? వాళ్ల పార్టీని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి కుటుంబపాలన చేయటం ప్రజలు చూస్తూనే ఉన్నరు. ఒక ఐఏఎస్ అధికారిగా ఆ చిన్నారులకు మీరేం సందేశం ఇవ్వదలచుకున్నరు? ముఖ్యమంత్రి అన్నకు, సీఎం కుటుంబసభ్యులకు ఇలా రాచమర్యాదలు స్వాగతం పలకాలని ఏ చట్టం చెప్తున్నది?’ అని నిలదీశారు.