హైదారాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోడుపట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 1,46,541 (96.71 శాతం) మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 4605 మంది రైతులకు వారం రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనితోపాటు గిరిజనులపై నమోదైన ఆక్రమణ కేసుల ఎత్తివేత, పంపిణీ చేసిన భూమికి త్రీఫేజ్ కరెంటు సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు కసరత్తు చేస్తున్నది.
కేసులన్నీ గతంలో నమోదైనవే
పోడుభూముల ఆక్రమణకు సంబంధించి గతంలో గిరిజనులపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వారికి ప్రభుత్వమే స్వయంగా పట్టాలు పంపిణీ చేస్తుండడంతో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే పట్టాలు పంపిణీ చేసినా అర్థ లేకుండాపోతుందని భావిస్తోంది. పోడుపట్టాల పంపిణీ సందర్భంగా కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివాసీ బిడ్డలపై ఇకపై ఎలాంటి కేసులు ఉండవని హామీ ఇచ్చారు. పోడు కేసులు ఎత్తివేయాలంటూ హోంశాఖ కార్యదర్శికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. రంగంలోకి దిగిన అధికారులు గిరిజనులపై నమోదైన ఆక్రమణ కేసుల చిట్టాను బయటకు వాటి ఎత్తివేతకు అసరమైన చర్యలు చేపట్టారు.
త్రీఫేజ్ కరెంటు సరఫరా
పట్టాలు ఇచ్చి, కేసులు ఎత్తివేసినంత మాత్రాన గిరిజనులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని భావించిన ప్రభుత్వం ఆయా భూములకు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీలైనంత త్వరగా విద్యుత్‌ను అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు సీఎం గిరివికాసం కింద పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.