అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారంటూ అంగన్వాడీ సిబ్బందిని నిలదీసిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో జరిగింది. ఆలుగామ అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాలింతలకు కోడి గుడ్లను పంపిణీ చేశారు. వాటిని శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉడకబెడుతుండగా దుర్వాసన రావడంతో అంగన్వాడీ కేంద్రానికి తీసుకువచ్చి సిబ్బందిని ప్రశ్నించారు. గుడ్లను పగులగొట్టడంతో దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీడీపీవో మనోరమను వివరణ కోరగా కుళ్లిన గుడ్లను సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ పిన్నారం, ఎసన్వాయి గ్రామాల్లోనూ కుళ్లిన గుడ్లు పంపిణీ చేసిన ఘటనలు జరిగాయి.
డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమని ఏఈవోలు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి పెదపల్లి డీఏఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. డిజిటల్ సర్వే చేయలేమని డీఏఓ ఆదిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఈవోలు మాట్లాడుతూ.. ఇప్పటికే వ్యవసాయశాఖలోని 49 రకాల పనులు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వేకు సహాయకులను నియమించాలని, లేకుంటే మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో చేస్తున్న సర్వేలా ఇక్కడా చేయాలని డిమాండ్ చేశారు.