మియాపూర్/వీణవంక, మే 13: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని రూ.3లక్షలు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి నియోజకవర్గపరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహన నగర్లో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ భాను, ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఓటరు జాబితా స్లిప్పులతో పాటు డబ్బులను పంపిణీ చేశారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని రూ. 2.90 లక్షల నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని, డబ్బులిచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నదని నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి రవికుమార్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో సోమవారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా బీజేపీకి ఓటేయాలని ఆ పార్టీ నాయకుడు రామిడి ఆదిరెడ్డి ఓటర్లకు డబ్బును పంపిణీ చేశారు. ఫ్లయింగ్ స్కాడ్ ఇన్చార్జి వడ్లకొండ ఐలయ్య ఆదిరెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, ఆయన వద్దనుంచి రూ.11 వేలను స్వాధీనం చేసుకొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఆదిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తిరుపతి తెలిపారు.