హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానీ చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో మేలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. నేడు రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఏక సంఘంగా ఏర్పడిన 11 బీసీ కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి కేటాయించిన స్థల పత్రాలను సహచర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి గంగుల గురువారం పంపిణీచేశారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల కోసం 87.3 ఎకరాలను 41 కుల సంఘాలకు కేటాయించడంతోపాటు రూ95 కోట్ల నిధులను కూడా కేటాయించారని చెప్పారు. కుల వృత్తులు ప్రతిఫలించేలా డిజైన్ చేసుకొని ఆత్మగౌరవ భవనాలు కట్టుకొనే అవకాశం కూడా కులసంఘం ట్రస్టులకే కల్పించారన్నారు.
అందులో భాగంగా ఇప్పటికే 24 కులాలకు పట్టాలు ఇచ్చామని, తాజాగా రజక , పద్మశాలి, నాయీబ్రాహ్మణ , ముదిరాజ్, వాల్మీకి బోయ, గాండ్ల , బొందిలి, కచి, ఆరె కటిక , భూంజ్వా, సంచార జాతులు.. ఇలా 11 కులాలకు అందజేశామని వెల్లడించారు. త్వరలోనే భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కులం అవసరాలు తీరే విధంగా, భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేలా ఫంక్షన్ హాళ్లు, హాస్టళ్లు, వసతి సౌకర్యాలు, విద్యా, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మిగతా కుల సంఘాలు సైతం త్వరలోనే ఏకం కావాలని, లేదంటే ప్రభుత్వమే వాటి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపడుతుందన్నారు. బీసీల పక్షాన సీఎం కేసీఆర్‌కు మంత్రి గంగుల ధన్యవాదాలు తెలియజేశారు.
బీసీలను ఏకం చేస్తున్న ఘనతముఖ్యమంత్రి కేసీఆర్‌దే: శ్రీనివాస్‌గౌడ్
నేటి కాలపు మహాత్మా జ్యోతిబాఫూలే సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. బీసీలంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వృత్తిపరంగా కులాలుగా స్థిరపడ్డారన్నారు. బీసీలను ఏకం కానీయకుండా కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని పూలే వెల్లడించారని గుర్తుచేశారు. చరిత్రలో బీసీలను ఏకం చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు. రూ.8 వేల కోట్ల విలువైన స్థలాలను బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించారని, ప్రతి కులం తమ ఆత్మ గౌరవం ప్రతిఫలించేలా నిర్మించుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికత వల్లేరాష్ట్రం ప్రగతి పథం: నిరంజన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా ఉండే వాల్మీకి బోయ, ముదిరాజ్ కులాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి గంగులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, 11 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.