ములుగు రూరల్, నవంబర్ 13 : ప్రభుత్వం నుంచి ఉచితంగా అందుతున్న నాణ్యత లేని చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని లోకం చెరువులో సుమారు 1.15 లక్షల చేప పిల్లలను మత్స్యకారులు విడుదల చేయగా నీటిలో పోసిన వెంటనే చనిపోయాయి.
మూడు రోజులుగా ములుగు మండలంలోని సొసైటీ పరిధిలో మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ జరుగుతుండగా చిన్న సైజు చేప పిల్లలు సరఫరా కావడంతో మత్స్యకారులు వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇంత కంటే పెద్ద సైజు రావడం లేదని, తీసుకోవాల్సిందేనని మత్స్యశాఖ అధికారులు సూచించడంతో రెండు రోజుల క్రితం వాటిని తీసుకొని చెరువులు, కుంటల్లో వదలగా గురువారం నాటికి అవి మృతి చెంది నీటిపై తేలియాడాయి.
నిబంధనల మేరకు 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజు ఉన్న బంగారు తీగ, రవ్వు, బొచ్చ చేప పిల్లలు రావాల్సి ఉండగా 10-15 మిల్లీమీటర్ల సైజు ఉన్న రెండు రకాల బుర్క, రవ్వు రకం మాత్రమే వస్తున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మాన్రాజ్ను వివరణ కోరగా చిన్న సైజు చేప పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేయకుండా తిరిగి వెనక్కి పంపిస్తున్నట్టు తెలిపారు.