CMSTEI | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం వరంగా మారింది. ఆదివాసీ, గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐబీఎం) ద్వారా శిక్షణ ఇప్పించి, వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 300 మంది ఉన్నత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇచ్చింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రాజెక్టు స్వరూపాన్నిబట్టి రూ.కోటి వరకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. ప్రభుత్వమే పూచీకత్తుగా బ్యాంకు లింకేజీని ఏర్పాటు చేయడంతోపాటు మొత్తం యూనిట్ కాస్ట్లో 35 శాతం సబ్సిడీని సైతం ప్రభుత్వమే అందిస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం మరో 24మంది ఔత్సాహిత పారిశ్రామికవేత్తలకు సీఎంఎస్టీఈఐ యూనిట్లను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని బంజారాభవన్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎంఎస్టీఈఐతోపాటు ఎంఎస్ఎంఈ, రూరల్ ట్రాన్స్పోర్టింగ్, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పథకాల లబ్ధిదారులకు మంత్రులు యూనిట్లు పంపీణీ చేస్తారు.
సీఎంఎస్టీఈఐ అర్హతలు
ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. లబ్ధిదారు ఎంపిక చేసుకొన్న పారిశ్రామికరంగంలో కనీసం రెండేండ్లు పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక విద్యార్హతలు, కొత్త స్టార్టప్స్, ఆర్థికంగా వెనుకబడినవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
సీఎంఎస్టీఈఐ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఎంపిక చేసుకొన్న రంగంలో 3 నెలలపాటు ఐబీఎం ద్వారా ప్రత్యేక (ఇంక్యుబేషన్ కోర్స్) శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా మార్కెట్ స్టడీ, డీపీఆర్ తయారీ, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ఫీల్డ్ స్టడీస్, పోస్ట్ ప్రాజెక్టు అనాలసిస్వంటి అంశాల్లో ఈ శిక్షణను ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా అందిస్తున్నది.
Minister Satyavathi Rathod
గిరిజన యువతకు కొత్తదారి
గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూపొందించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతూ తమను తాము ఉన్నతీకరించుకొంటున్నందుకు సంతోషంగా ఉంది. దేశంలో ఈ తరహా పథకం ఎక్కడాలేదు. గిరిపుత్రులు ఈ పథకం ద్వారా ఉపాధి పొందటమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.
– సత్యవతి రాథోడ్,గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి
28