TREIRB | హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటున్నది. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆడుతున్నది. క్రమపద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నదని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నా రు. బ్యాక్లాగ్ పోస్టులను తమ ఖాతాలో వేసుకునే కుట్రలకు రేవంత్‌రెడ్డి సర్కారు తెరలేపిందని ధ్వజమెత్తుతున్నారు. అందుకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీసుకుంటున్న నిర్ణయాలే బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతా పారదర్శకంగా ఉంటే గోప్యత ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రభుత్వ, ట్రిబ్ చర్యలను నిరసిస్తూ అభ్యర్థులు గురువారం ధర్నాకు పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకొని నిరసన తెలపాలని నిర్ణయించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గు రుకులాల్లో తొలుత నిర్ణయించిన దానికి విరుద్ధంగా పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ట్రిబ్ రాత్రికి రాత్రే సిద్ధమైంది. మొత్తం 9 క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టింది. వీటి లో పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూ జిక్ టీచర్ 124 పోస్టులు ఉన్నాయి. డీఎస్, జేఎల్, ఆ తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులను వరుస క్రమంలో భర్తీ చేయాలని ట్రిబ్ నిర్ణయించింది. కానీ ఉన్నట్టుండి డీఎల్, జేఎల్ పోస్టులను నింపకుండానే నేరుగా పీజీటీ పోస్టుల భర్తీకి పూనుకున్నది. కనీస వ్యవధి ఇవ్వకుండానే 1:2 నిష్పత్తిలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించడంతోపాటు, నాలుగు రోజుల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది. 24 గంటలు తిరగకముందే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ట్రిబ్ విడుదల చేసింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. దీంతో దివ్యాంగుల కోటాను అసలు నింపుతున్నారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇదే విషయమై వివరణ కోరేందుకు ఫోన్ లో మీడియా ప్రతినిధులు సంప్రదించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ప్రభు త్వం కావాలనే బ్యాక్లాగ్ పోస్టుల సృష్టికి య త్నిస్తున్నదని అర్థమవుతున్నది. ఖాళీగా ఏర్పడే బ్యాక్లాగ్ పోస్టులను తిరిగి మరోసారి నింపేందుకేనని అభ్యర్థులు మండిపడుతున్నారు.
పీజీటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేసేందుకు ట్రిబ్ సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియం వేదికగా ట్రిబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేయనున్నారు. అయితే అభ్యర్థులను గురుకుల సొసైటీలకు మాత్రమే అలాట్ చేస్తూ నియామకపత్రాలను అందివ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, ట్రిబ్ నియామక ప్రక్రియను నిరసిస్తూ గురుకుల అభ్యర్థులు ఎల్పీ స్టేడియం వద్ద భారీ ధర్నాను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే టీజీటీ పోస్టుల భర్తీకీ ట్రిబ్ కసరత్తు చేపట్టింది. అన్ని గురుకులాల్లో కలిపి టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులు 4,020 ఉండగా, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసిం ది. నేడు లేదా రేపు జాబితాను ప్రకటించేందుకు ట్రిబ్ సన్నాహాలు చేస్తున్నదని సమాచారం.