e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home తెలంగాణ 500 కుటుంబాలకు 12,000 గొర్రెలు

500 కుటుంబాలకు 12,000 గొర్రెలు

  • ఆరు వేల కోట్లతో రెండో విడత కార్యక్రమం
  • జమ్మికుంటలో ప్రారంభించిన మంత్రి తలసాని
  • 500 కుటుంబాలకు 12 వేల గొర్రెలు పంపిణీ
  • ఆఖరి గొల్ల, కుర్మ ఇంటి దాకా గొర్రెలు అందిస్తాం
  • సీఎం కేసీఆర్‌ పాలనే ఈ రాష్ర్టానికి శ్రీరామ రక్ష
  • పశు సంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌

కరీంనగర్‌/ హైదరాబాద్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మరోమంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 500 యూనిట్లలో 12,000 గొర్రెలు పంపిణీచేశారు. గొర్రెల యూ నిట్‌ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెం చి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ఆఖరి గొల్ల కురుమ కుటుంబం వరకు గొర్రెలు పంపిణీచేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా అది రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుందని చెప్పా రు. హుజూరాబాద్‌ కోసమే పథకాలు అమలు చేస్తారంటున్న మూర్ఖులకు ఇది అర్థంకాదని మండిపడ్డారు. 2014లో సీఎంగా కేసీఆర్‌ వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని చెప్పారు. యాదవులు కొలిచే మల్లన్న, కురుమలు కొలిచే బీరన్న, ఇద్దరు దేవుళ్ల స్వరూపమే సీఎం కేసీఆర్‌ అని అభివర్ణించారు.

ఎవరైనా ఆలోచించారా?
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో గొల్ల, కురుమల గురించి ఏ ఒక్క నాయకుడూ ఆలోచించలేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందే కేసీఆర్‌కు ఒక కల్పన ఉండేదని, రాష్ట్రం సిద్ధించిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేయాలని కలలు కన్నారని, కుల వృత్తులపై ఆధారపడినవారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారని చెప్పారు. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే గొర్రెల పంపిణీ పథకమని తెలిపారు.

- Advertisement -

అన్ని వృత్తుల అభివృద్ధే ధ్యేయం
హుజూరాబాద్‌ కోసమే రెండోవిడత గొర్రెల పంపిణీ చేపట్టారంటూ కొన్ని మీడియాలు, కొందరు అర్థంలేని విషప్రచారం చేయడంపై మంత్రి తలసాని ధ్వజమెత్తారు. దళితబంధుపై కూడా కొందరు ఇలాంటి విమర్శలే చేస్తున్నారని, సీఎం కేసీఆర్‌ గతంలోనే ఈ పథకం గురించి శాసనసభలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కుల వృత్తులపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని స్పష్టంచేశారు. హు జూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సోకాల్డ్‌ నాయకు లు ఈ రాష్ర్టానికి ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. రాష్ర్టానికి ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా తీసుకురావాలని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని సవాల్‌ విసిరారు.

స్వయంకృతం
ఇక్కడి నాయకులు కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, ఏడేండ్లు అధికారంలో ఉన్నపుడు ఇదే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మహారాజులా తిరిగారు కదా అని పరోక్షంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సెటైర్లు వేశారు. మీరు చేసుకున్న స్వయంకృతాపరాధం వల్లే మీరు నష్టపోయారని, ఇపుడు ఢిల్లీకి వెళ్లి ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరిగితే ఆత్మగౌరవం దెబ్బతినడం లేదా అని నిలదీశారు.

ఆరున్నరేండ్లలో అనూహ్య వృద్ధి
ఒకప్పుడు రాష్ట్రంలో 1.10 కోట్ల గొర్రెల ఉండేవని, మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 80 లక్షల గొర్రెల ద్వారా 1.30 కోట్ల గొర్రెలు పునరుత్పత్తి జరిగిందని, తెలంగాణలో గొల్ల, కురుమలు పెంచుతున్న గొర్రెలు దేశంలోనే అత్యధిక సంపదగా కేంద్ర సాక్షాత్తు పార్లమెంట్‌లో వెల్లడించిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తుచేశారు. ఆరున్నరేండ్లలో అనూహ్య అభివృద్ధి సాధించినట్టు చెప్పారు.

సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొప్పుల
రాష్ట్రంలోని గొల్ల, కురుమల కోసం సీఎం కేసీఆర్‌ తెచ్చిన ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్‌ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ ఈ పథకంలో రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, కరీంనగర్‌ జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మా ఇంట్ల ముగ్గురికి వచ్చినయ్‌..
పోయినసారి నాకు నా చిన్న కొడుక్కు గొర్రెలచ్చినయి. ఇప్పుడు నా పెద్ద కొడుక్కు వచ్చినయి. మా ఇంట్ల అందరూ సంతోష పడుతున్నరు. అన్ని కలుపుకొని కాసుకుంటం. ఇంత మంచి పనిచేసిన సీఎం కేసీఆర్‌ సారును ఎప్పటికీ మర్చిపోం. మాది తిన్నరేవును తలిచే కులం. మాకు ఇంత పెద్ద దిక్కుగా నిలిచిన కేసీఆర్‌కు ఏమిచ్చినా రుణంతీరది. ఈ గొర్రెలతోని మా ఇల్లు మొత్తం మారిపోతది.

  • అమ్ముల బక్కయ్య, కందుగుల (హుజూరాబాద్‌)

గొర్లంటే నాకు పాణం..
నాకు మొదటి సంది గొర్లు ఉండేటియి. పదేండ్ల కింద బిడ్డ పెండ్లికి అమ్ముకున్న. ఇగ మల్ల కొనుక్కుందామంటే పైసలు లేకుండె. గొర్లంటే నాకు పాణం. ఎట్లనన్నజేసి పది నాగలు (గొర్రెలు) కొనుక్కోవల్నని అనుకున్న. కని, సీఎం కేసీఆర్‌ సార్‌ మా గొల్లకుర్మలకు గొర్లు ఇస్తండని తెలుసుకుని ఆగిన. ఇప్పుడు నాకు 21 గొర్లు అచ్చినయి. ఎంతో సంతోషంగున్నది. ఇవిట్ని కాసుకుని మల్ల సెలకల పొంటి తిర్గుత.
-ఎనుగుల కొంరయ్య, గడ్డివానిపల్లి (ఇల్లందకుంట)

మళ్ల గొర్రెలు మేపుకుంట..
పది పదిహేను ఏండ్ల కింద నాకు 30 గొర్రెలు ఉండెటియి. బిడ్డ పెండ్లికి అయిన అప్పులు తీర్చెతానికి అమ్ముకున్న. అప్పటి సంది నా పాణమంతా తండ్లాతుండేటిది. గొర్లు కొనుక్కోవల్నంటే పైసలుగావల్నాయే. ఇపుడు పదేండ్ల సంది గొర్లు లేక ఎవుసమే చేసుకుంటన్న. ఇపుడు కేసీఆర్‌ సారు ఇచ్చిన గొర్లతోని మళ్ల పాణమచ్చింది. ఎవుసం చేసుకుంట మళ్ల గొర్లు మేపుకుంట. నాకు చాన సంతోషమనిపిస్తున్నది.

  • వేముల పోచాలు, పాపక్కపల్లి (జమ్మికుంట)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana