Special Police | డిచ్పల్లి, నవంబర్ 3: ‘చెప్పుకోవడానికే పోలీసు ఉద్యోగం.. చేసేది మాత్రం వెట్టిచాకిరి. గడ్డి తీయాలి, రాళ్లు ఎత్తాలి.. సెలవుల్లేకుండా పని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉండాలి. మా సమస్యలు చూడలేక ఇంటోళ్లు విడాకులు ఇచ్చి వెళ్లిపోతామంటున్నారు. పెండ్లికాని కానిస్టేబుళ్లకేమో పిల్లనిస్తలేరు’.. ఇదీ బెటాలియన్ పోలీసులు ఆవేదన. ఈ వ్యవస్థ మారాల్సిందే.. రాష్ట్రమంతా ఒకే పోలీసు విధానం అమలు చేయాల్సిందే అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 13 బెటాలియన్లు పని చేస్తున్నాయి. ప్రతీ బెటాలియన్‌లో 1500 మంది సిబ్బంది ఉంటారు. వారిలో 200 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు పరిమితం చేసి మిగిలిన వారిని బెటాలియన్ పరిధిలోని పోలీసుస్టేషన్లకు 33 శాతం చొప్పున తరచూ మారుస్తూ ఉంటారు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉంటారో తెలియదు. గతంలో బెటాలియన్‌లో పనిచేసే ఉద్యోగులకు నెలకు 15 రోజుల విధులు నిర్వహించిన తర్వాత, వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ రూల్స్ మార్చి, 26 రోజులు పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కొత్త ఆదేశాల కారణంగా రోజుల తరబడి ఇంటికి దూరమవ్వాల్సి రావడాన్ని కుటుంబసభ్యులు అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే ‘మీరు విధుల పేరిట ఊర్లు తిరగండి. మేం విడాకులు ఇచ్చి వెళ్లి పోతామని’ భార్యలు హెచ్చరిస్తున్నారని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బెటాలియన్‌లో చేసే వెట్టి చాకిరిని చూసి, పెండ్లి కాని సిబ్బందికి పిల్లను ఇవ్వడానికి ముందుకే రావడంలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందేనన్న భావనతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్లలోనూ కానిస్టేబుళ్లు, వారు కుటుంబ సభ్యులు నిరసనలకు దిగుతున్నారు.
రేవంత్‌ని గెలిపించింది ఇందుకేనా?
మా కొడుకు పది రోజులకోసారి ఇంటికొస్తుండే. ఇప్పుడు 26 రోజులకొకసారి ఇంటికి వస్తుండు. ఏమైంది అని అడిగితే సెలవులు తగ్గించిండ్రని చెప్పిండు. బిడ్డల్ని ఇబ్బంది పెట్టేందుకేనా రేవంత్‌రెడ్డిని సీఎంను చేసింది? మా పిల్లలు ఆఫీసర్లకు మందు కలిపి ఇవ్వాల్న? గిదేనా పోలీసు ఉద్యోగమంటే?
– ఓ బెటాలియన్ కానిస్టేబుల్ తల్లి
మూడు నెలలకో పోస్టింగా?
ఒక రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలి. ఇదేం పద్ధతి? మూడు నెలలకోసారి పోస్టింగ్ మార్చుకుంటపోతే మా పిల్లల చదువులు ఏం కావాలి? భర్తలతో కలిసి ఉండే హక్కు మాకు లేదా? మావోళ్ల సమస్యలు తీర్చాలని కుటుంబాలు రోడ్డెక్కితే, భర్తలను సస్పెండ్ చేసుడేంది? సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
– ఓ కానిస్టేబుల్ భార్య
ఒకే చోట ఐదేండ్లుండాలి
బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాల బాధలు ఎవరికీ చెప్పుకోలేనివి. పిల్లలు తండ్రి ప్రేమకు నోచుకోక మనోవేదనకు గురవుతున్నారు. మా ఆయన డ్యూటీపై ఇతర ప్రాంతాలకు, రాష్ర్టాలకు వెళ్తే, ఏదైనా ఆపద వస్తే ఆదుకునే వారుండరు? ఐదేండ్లు ఒకేచోట పని చేసేలా చర్యలు తీసుకోవాలి.
– మరో కానిస్టేబుల్ భార్య డిమాండ్