మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ పర్యటన విజయవంతం కావడం.. గద్వాల నియోజకవర్గంలో పెరుగుతున్న వ్యతిరేకత.. అనుచరులంతా హ్యాండివ్వడం సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్లకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చని తాజాగా ఆయన వేసిన ఎత్తుగడ హాస్యాస్పదంగా మారింది. జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నా అభివృద్ధి జరగడంలేదని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా దక్షిణ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని.. మంత్రులు హెలిక్యాప్టర్లలో తిరుగుతూ రివ్యూలు చేస్తున్నారే తప్ప పనులు కావడం లేదని కొన్ని మీడియా చానళ్లల్లో వాపోయారు.
అనర్హత వేటు ఖాయమని తెలిసి దాన్నుంచి తప్పించుకునేందుకు బండ్ల చీప్ పాలిటిక్స్‌కు పాలుపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలు ఆయనకు హ్యాండివ్వడం.. ముఖ్య అనుచరులంతా బీఆర్ఎస్లోకి వెళ్లిపోవడం.. కాంగ్రెస్ పార్టీలో సరిత వర్గం తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తుండడంతో బండ్ల త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈలోపు మెడపై కత్తి వేలాడినట్టు.. అనర్హత వేటు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం సూచించిన మేరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అనుచరులే బాహాటంగా చెబుతున్నారు. ఇన్నాళ్లు అంటీముట్టనట్టు వేలాడిన బండ్ల.. తాజాగా చేస్తున్న విమర్శలు చూసి జనం నవ్వుకుంటున్నారు. పార్టీ మారి వ్యతిరేకత మూటగట్టుకున్నారని అనుచరులు అనడంతో బండ్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.